iDreamPost

కొత్త కరోనా గురించి ఆరోగ్య మంత్రి హెచ్చరికలు

కొత్త కరోనా గురించి ఆరోగ్య మంత్రి హెచ్చరికలు

‘కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కొత్త స్ట్రెయిన్‌ కలకలం, టీకా రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై ఈటల వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారిని ప్రత్యేక పరిశీలనలో పెట్టామని, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. నెగెటివ్‌ వచ్చినవారిని సైతం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

కొత్త స్ట్రెయిన్‌ సోకినవారు ఎక్కువ సంఖ్యలో ఉన్న జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ జిల్లాలవారే ఎక్కువగా యూకే నుంచి వచ్చినట్లు గుర్తించారు. వారందరికీ యుద్ధ ప్రాతిపదికన టెస్టులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల వైద్య యంత్రాంగాలు ఆ పనిలోనే నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఉన్న కరోనా వార్డులతో సంబంధం లేకుండా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్త స్ట్రెయిన్‌ సోకే ఒక్కో రోగిని ఒక్కో గదిలో ఉంచి వైద్యం అందించనున్నారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్‌ ఆస్పత్రిలో రెండు ఫ్లోర్‌లను అందుకోసం ప్రత్యేకంగా కేటాయించారు. ప్రస్తుతం నమూనాలు సేకరించిన చేస్తోన్న పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. డిసెంబరు 9 తర్వాత యూకే నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌కు 380 మంది, రంగారెడ్డికి 70 మంది, మేడ్చల్‌కు 270 మంది వచ్చారని తెలిపారు. మొత్తంగా 1200 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ రెండు రోజుల్లోనే టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ 1200 మందిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల వారే 70 శాతం మంది ఉన్నారని, వారి చిరునామాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని, ఇప్పటికే వారిని ట్రేస్‌ చేసి కొందరి నమూనాలను సేకరించామని అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి