iDreamPost

ఆ శాఖపై మనసు పారేసుకున్న కేటీఆర్‌.. అధికారంలోకి రాగానే అదే అడుగుతారట

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రస్తుతం ఐటీ, మున్నిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌.. ఓ డిపార్ట్‌మెంట్‌ మీద మనసు పడ్డారు. ఈసారి అధికారంలోకి రాగానే ఆ శాఖ అడుగుతాను అన్నారు. ఆ వివరాలు..

ఆ శాఖపై మనసు పారేసుకున్న కేటీఆర్‌.. అధికారంలోకి రాగానే అదే అడుగుతారట

తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు తీవ్ర స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దాంతో సమయం లేదు మిత్రమా అన్నట్లు.. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలను స్పీడప్‌ చేశాయి. ఇక ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి.. మిగతా పార్టీలతో పోలిస్తే.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ అడుగు ముందే ఉంది. అభ్యర్థుల ప్రకటన మొదలు.. ప్రచార కార్యక్రమాలు ఇలా అన్ని అంశాల్లో.. కారు పార్టీ యమ స్పీడ్‌గా దూసుకుపోతుంది.

ఇక గులాబీ పార్టీ తరఫున కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత, హరీశ్‌ రావులు.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ అయితే ఒక​ రోజే 3, 4 చోట్ల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇక కేటీఆర్‌ కూడా ఎన్నికల క్యాంపెయిన్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి అదికారంలోకి రాగానే కచ్చితంగా ఆ శాఖను అడుగతాను అన్నారు. మరి ఇంతకు కేటీఆర్‌ మనసు పారేసుకున్న ఆ శాఖ ఏది అంటే..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. శుక్రవారం బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌ (బీఎన్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈసారి అధికారంలోకి రాగానే పర్యాటక శాఖ ఇవ్వమని అడుగుతాను అన్నారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పర్యాటక శాఖ తీసుకుంటాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో చేసి చూపించిందని తెలిపారు. తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత ఇవి ఇంకా మెరుగయ్యాయని చెప్పుకొచ్చారు. అలానే వైద్య, ఆధ్యాత్మిక, క్రీడా, అటవీ శా పర్యాటకాలకు కూడా తెలంగాణలో మంచి అవకాశాలున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. గండిపేట, హిమాయత్‌సాగర్‌ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా టూరిజం వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. గత పదేళ్లలో హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో ఇక్కడి జనాలు మాత్రమే కాక పక్క రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం గుర్తించి ప్రశంసిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ హీరో, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్‌. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫాక్స్‌కాన్‌ అధినేత యాంగ్‌ లీ హైదరాబాద్‌ను చూసి ఇది భారతదేశంలా కనిపించడంలేదని అన్నారని తెలిపారు. భాగ్యనగరం సాధించిన ప్రగతికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు కేటీఆర్‌.

ఈ రంగంలో అభివృద్దికి, ఉపాధి కల్పనకు మరిన్ని అవకాశాలున్నాయని.. అందుకే ఈసారి అధికారంలోకి రాగానే.. తాను పర్యాటక శాఖను అడుగుతాను అన్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ హయాంలో తీవ్రమైన విద్యుత్తు కోతలు, నీటి కొరత ఉండేదని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం సమస్యలన్నిటినీ అధిగమించడంతోపాటు సర్వతోముఖాభివృద్ధి సాధించిందని.. మరోసారి విజయం సాధించి.. రాష్ట్రాభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.