iDreamPost

తండ్రి రిక్షా కార్మికుడు.. తల్లి కూలీ.. సివిల్స్‌ పక్కనపెట్టి ఎన్నికల బరిలో ఐఐటీయన్‌

  • Published Nov 14, 2023 | 11:46 AMUpdated Nov 14, 2023 | 11:46 AM

ఒకప్పుడు ఎన్నికలంటే బాగా డబ్బులున్న వాళ్లు, కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లు మాత్రమే అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అది మారింది. తాజా ఎన్నికల బరిలో ఐఐటీ విద్యార్థిని ఒకరు పోటీ చేస్తున్నారు. ఆ వివరాలు..

ఒకప్పుడు ఎన్నికలంటే బాగా డబ్బులున్న వాళ్లు, కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లు మాత్రమే అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అది మారింది. తాజా ఎన్నికల బరిలో ఐఐటీ విద్యార్థిని ఒకరు పోటీ చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 14, 2023 | 11:46 AMUpdated Nov 14, 2023 | 11:46 AM
తండ్రి రిక్షా కార్మికుడు.. తల్లి కూలీ.. సివిల్స్‌ పక్కనపెట్టి ఎన్నికల బరిలో ఐఐటీయన్‌

తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. 15 రోజుల తర్వాత పోలింగ్‌ జరగనుంది. వచ్చే నెల అనగా డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థులందరూ స్పీడ్‌ పెంచారు. ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో.. అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న కొందరు నేతలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఐఐటీ స్టూడెంట్‌ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆ వివరాలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున దాసరి ఉష (27) అనే యువతి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఉష ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. జాబ్‌ ఆఫర్స్‌ వచ్చినప్పటికి.. కలెక్టర్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు చదువుతున్నారు ఉష. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం.. ఆమె తన సివిల్స్‌ కలను పక్కకు పెట్టారు. ఇక ఉష వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె స్వస్థలం పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామం. ఉషది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి రిక్షా కార్మికుడు కాగా.. తల్లి భవన నిర్మాణ కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం ఉషది.

పేదరికం కారణంగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే.. ఉష తల్లిదండ్రులు ఆమె చదువుకు అడ్డంకి కలిగించలేదు. కన్నవాళ్ల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఉష.. కష్టపడి చదివింది. ఐఐటీలో సీటు సాధించింది. ధన్‌బాద్‌లో గ్రాడ్యూయేషన్‌ కంప్లీట్‌ చేసింది. ఇక ఉష తమ్ముడు కూడా రూర్కెలాలో గ్రాడ్యుయేషన్ పూర్తి ప్రస్తుతం యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలో పద్మ హనుమయ్య ఫౌండేషన్‌ స్థాపించి పిల్లల చదువుకు, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నారు. ఓవైపు సేవా కార్యక్రమాలు చేపడుతూనే.. మరో వైపు సివిల్స్‌ కోసం ప్రిపేరవుతుంది ఉష. అయితే కరోనా మహమ్మారి ఆమె దృక్పథాన్ని మార్చి గ్రామానికి వచ్చేలా చేసింది.

రాజకీయాల్లోకి రావాలని భావించిన ఉష.. గత రెండేళ్లుగా పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వెనుకబడిన వర్గాలు, మహిళా ఉద్యమాలతో చురుగ్గా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ‘‘చిన్నతనం నుంచి మా తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగాను. వారే నా మొదటి హీరోలు. గ్రాడ్యూయేషన్‌ పూర్తైన తర్వాత.. సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించాను. కానీ కలెక్టర్‌ కన్నా రాజకీయాల్లోకి వస్తే.. ప్రజలకు మరింత సేవ చేయవచ్చని భావించాను. అందుకే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాను. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఉన్నత వర్గాలకు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయే తప్ప పేదలకు అనుకూలంగా లేవు’’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ తరపున దాసరి మనోహర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ తరపున చింతకుంట విజయరమణ రావు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. తన ప్రత్యర్థుల డబ్బు శక్తికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు ఉష వెల్లడించారు. మహిళలు, యువతకు అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి