iDreamPost

అప్ప‌టి వ‌ర‌కూ ఆపండి : టీపీసీసీ ఎంపిక‌లో మ‌రో ట్విస్ట్

అప్ప‌టి వ‌ర‌కూ ఆపండి : టీపీసీసీ ఎంపిక‌లో మ‌రో ట్విస్ట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా జీవ‌న్ రెడ్డి ఖ‌రార‌య్యార‌ని, నేడో, రేపో అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న త‌రుణంలో మ‌రో ట్విస్ట్ తెర‌పైకి మొద‌లైంది. రాష్ట్రంలోనాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో పాటు కొంత మంది సీనియ‌ర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు.. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి స్వ‌యంగా ఫోన్ చేసి కోరిన‌ట్లు తెలుస్తోంది. అభ్య‌ర్థిగా ఎవ‌రి పేరు ప్ర‌క‌టించినా.. పీసీసీ లో గొడవ త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని హస్తిన పెద్దలకు జానారెడ్డి తేల్చిచెప్పారు. ఉప ఎన్నికల ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని హెచ్చరించారు. పార్టీలో అంద‌రితోనూ మంచి సంబంధాలున్న జీవ‌న్ రెడ్డి అయితే ఏ ఇబ్బందీ ఉండ‌ద‌ని అధిష్ఠానం భావిస్తుంద‌ని, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి అంగీక‌రించిన నేప‌థ్యంలో ఇక ఇబ్బందులు ఉండ‌వ‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని భావిస్తున్న త‌రుణంలో జానారెడ్డి ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

ఆలోచ‌న‌లో ఏఐసీసీ..!

జానారెడ్డి విజ్ఞప్తితో పీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందన్న అంశంపై‌ అభిప్రాయాలు సేకరించారు. ఈ విషయంపై ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హస్తినకు పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అయితే తాజాగా జానారెడ్డి సూచనతో పీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఉత్కంఠగా మారింది. కాగా టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ రేవంత్‌రెడ్డే కాబోయే చీఫ్‌ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు రేవంత్‌కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి