iDreamPost

బెంగాల్ లో పొలిటికల్ దంగల్.. దీదీ తో బీజేపీ ఢీ

బెంగాల్ లో పొలిటికల్ దంగల్.. దీదీ  తో బీజేపీ ఢీ

ప‌ట్టు సాధించాల‌నుకుంటున్న రాష్ట్రాల‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభిస్తున్న బీజేపీ ప‌శ్చిమ బెంగాల్ పై కూడా దృష్టి సారించింది. త్వరలో బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తుండ‌డంతో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. గత కొంత కాలంగా బీజేపీ – టీఎంసీ మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి అనంతరం అవి కాస్తా ముదిరాయి. ఇదిలా ఉండ‌గా.. అధికార తృణమూల్‌ పార్టీని దెబ్బకొట్టి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్‌ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన మంత్రి సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇక ఈరోజు మరో ఎమ్మెల్యే శిల్‌భద్ర దత్తా సహా మైనార్టీ సెల్‌ నాయకుడు కాబిరుల్‌ ఇస్లాం టీఎంసీని వీడారు.

ఈ నెల 9,10 తేదీలలో బెంగాల్‌లో నడ్డా పర్యటించినప్పుడు ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు డైమండ్‌ హార్బర్‌ ఎస్‌పీ భోలనాధ్‌ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ ప్రవీణ్‌ త్రిపాఠీ, దక్షిణ బెంగాల్‌ ఏడీజీ రాజీవ్‌ మిశ్రాలు ఆయనకు భద్రతా అధికారులుగా వ్యవహరించారు. ఆ సమయంలో డైమండ్‌ హార్బర్‌ వద్ద నడ్డా కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ ముగ్గురు అధికారులను డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో చేరమని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వారిని రిలీవ్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.

టీఎంసీలో నెంబర్‌ 2గా ఉన్న సువేందు అధికారి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఆయన గత నెలలో మంత్రి పదవికి, బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సీనియర్‌ నేతలు కూడా ఆయన బాట పడుతున్నారు. అసన్సల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిపాలనా మండలి చైర్మన్‌ పదవికి జితేంద్ర తివారీ, దక్షిణ బెంగాల్‌ రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి దిప్తాంగ్‌షు చౌధరి రాజీనామా చేశారు. తనపైన, తన అనుచరులపైన పోలీసులు తప్పుడు క్రిమినల్‌ కేసులు పెట్టకుండా చూడాలని గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ని సువేందు కోరారు. సువేందులోని భయాందోళనను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. సువేందు రాజకీయంగా బలమైన కుటుంబ నేపథ్యం గల నేత. ఆయన తండ్రి సిసిర్‌ అధికారి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. సోదరుడు దివ్యేందు టీఎంసీ సిటింగ్‌ ఎంపీ. సొంత జిల్లా తూర్పు మిడ్నపూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని 40 నుంచి 45 శాసనసభా స్థానాల్లో వారి కుటుంబం ప్రభావం చూపగలదు. శనివారం నుంచి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో సువేందు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ‌త 24 గంటల్లోనే నలుగురు ముఖ్యనేతలు పార్టీని వీడటం, రానున్న రోజుల్లో భారీ ఎత్తున క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీఎంసీ మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి సహా ఆయన అనుచరుడు, దక్షిణ బెంగాల్‌ రాష్ట్ర రవాణా సంస్థ చీఫ్‌, గ్రీవెన్స్‌ సెల్‌ హెడ్‌ కల్నల్‌ దీప్తాంశు చౌదరి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌కు లేఖ పంపించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ వారంతంలో బెంగాల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వీరంతా అప్పుడే కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అల‌ర్ట్ అవుతున్నారు. త్వ‌ర‌లో ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి దీనిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెల‌సింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి