iDreamPost

రైటర్ గా టాప్ – డైరెక్టర్ గా ఫ్లాప్

రైటర్ గా టాప్ – డైరెక్టర్ గా ఫ్లాప్

ఒక ఫీల్డ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇంకో రంగంలో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. కొందరు దాన్ని సాధ్యం చేసి చూపిస్తే మరికొందరు వివిధ కారణాల వల్ల విజయం సాధించలేకపోతారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాని ఇక్కడ మాత్రం సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి చెప్పుకుందాం. నవలా రంగానికి ఒక గ్లామర్ తీసుకొచ్చి కేవలం రచయిత పేరు మీద పుస్తకాలను హాట్ కేకుల్లా అమ్ముడుపోయే ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన అతి కొద్దిమందిలో ఈయన ఒకరు.

తులసిదళం లాంటి హారర్ రాసినా, వెన్నెల్లో ఆడపిల్ల లాంటి సున్నితమైన ప్రేమ కథ చెప్పినా, విజయానికి 5 మెట్లు అంటూ స్ఫూర్తి ఇచ్చినా అన్ని చదువరులతో చప్పట్లు కొట్టించే స్థాయిలో సాగడం తెలుగు పుస్తక ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నో సినిమాలకు రచనా విభాగంలో ఉన్న యండమూరి దర్శకుడిగా మాత్రం విజయం సాధించలేకపోవడం విచిత్రం.

విభిన్నమైన కాన్సెప్ట్ తో నవల రూపంలో సూపర్ హిట్ అయిన అగ్నిప్రవేశంని అదే పేరుతో యండమూరి వీరేంద్రనాథ్ అదే టైటిల్ తో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ ఒకరు.

అల వైకుంఠపురములో ఉండే బిడ్డల మార్పిడి కాన్సెప్ట్ ఇందులో చూడొచ్చు. కాని సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తో 1991లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో తలలు పండిన దర్శకులకే చిరు ఆఫర్ ఇవ్వడం లేదు. ఇంకేం దశ తిరిగిందనుకున్నారు అందరు. కాని స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్ అయ్యింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రచన చేసిన యండమూరి తాను రాసుకుని డైరెక్ట్ చేసిన 2 సినిమాల ద్వారా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. గొప్ప అవకాశం ఇలా అయ్యిందని ఆయన పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఇండస్ట్రీనే అంత. ఇలాంటి విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి