iDreamPost

Tollywood Shootings షూటింగులు బందు – సమస్యలు తీరేనా

Tollywood Shootings షూటింగులు బందు – సమస్యలు తీరేనా

పరిశ్రమ కొంత కాలంగా ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించుకునే లక్ష్యంతో ఈ రోజు నుంచి షూటింగుల ఆపేస్తున్నట్టు నిన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు ఫిలిం ఛాంబర్ లు సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల కొందరు చిన్న నిర్మాతలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తాము కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు. ఏది ఎలా ఉన్నా అధిక శాతం చిత్రీకరణలు ఆగిపోనున్న మాట వాస్తవం. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, టికెట్ ధరలు, స్టార్ల రెమ్యునరేషన్లు, ఆర్టిస్టుల అదనపు ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, ఓటిటి రిలీజుల పంచాయితీ, కార్మికుల వేతనాలు అన్ని ఇష్యూస్ ని మాట్లాడబోతున్నారు.

వీటిలో ఎన్నిటికి పరిష్కారం తీసుకొస్తారో అంతు చిక్కడం లేదు. పెద్ద హీరోల పారితోషికాల విషయంలో ప్రొడ్యూసర్ల మధ్యే ఏకాభిప్రాయం లేదు. ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఏకంగా పది ఇరవై కోట్లు పెంచేస్తోంది వాళ్లే. ఏమైనా అంటే మార్కెట్ లో డిమాండ్ ఉంది కదాని అంటారు. మరి ఫ్లాప్ అయినప్పుడు సదరు తారలు ఆ నష్టాన్ని పంచుకోవాలి కదానే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.డిజిటల్ వర్చువల్ ప్రింట్ కు సంబంధించిన చార్జీలు కూడా పెనుభారంగా మారిన తరుణంలో ఇలాంటి ఎన్నో అంశాల్లో తీవ్ర సంక్లిష్ఠత ఉంది. ఇప్పుడీ బంద్ వల్ల నటీనటులకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ రోజువారీ ఉపాధి మీద ఆధారపడిన వాళ్లకు జీతంరాళ్లు ఉండవు.

ఇది ఎన్ని రోజులు ఉంటుందనే దాని మీద స్పష్టత లేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రేక్షకులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎటొచ్చి మళ్ళీ దెబ్బ తినేది ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వాళ్ల. మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పెరిగిపోతున్న తినుబండారాల దోపిడీ మీద కూడా దృష్టి సారించాలని ప్రేక్షకులు కోరుతున్నారు కానీ అదెంత వరకు పరిగణనలోకి వస్తుందో అనుమానమే. బాలీవుడ్ మొదలుకుని అన్ని చోట్ల ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కువ నిర్మాణాలు జరుగుతోంది మనదగ్గరే కాబట్టి చైతన్యం ముందు ఇక్కడి నుంచే మొదలయ్యింది. గతంలోలా మొదలుపెట్టి నీరసపడకుండా ఖచ్చితంగా పరిష్కారాలు దొరికేలా చొరవ తీసుకోవడం చాలా అవసరం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి