iDreamPost

మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ ప్రభంజనం

మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ ప్రభంజనం

పశ్చిమ బెంగాల్లో బీజేపీ సహా ప్రతిపక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ జోరును తట్టుకోలేక ఆ పార్టీలు పూర్తిగా చతికిల పడ్డాయి. ఆ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 108 మున్సిపాలిటీల్లో 103 పురపాలక సంఘాల్లో టీఎంసీ జైత్రయాత్ర సాగించింది. బీజేపీ, కాంగ్రెసులకు ఒక మున్సిపాలిటీ అయినా దక్కలేదు. లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోగా మూడుచోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. అయితే డార్జిలింగులో మాత్రం అధికార పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫిబ్రవరి 27న 107 మున్సిపాలిటీల్లో 2171 కౌన్సిలర్ పదవులకు పోలింగ్ జరిగింది. దాదాపు 95 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 103 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా దీన్హాతా మున్సిపాలిటీని అధికార పార్టీ ఏకగ్రీవంగా చేజిక్కించుకుంది.

సువేందు అధికారికి గట్టి దెబ్బ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంప పెట్టులా మారగా.. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, అసెంబ్లీ ఎన్నికల్లో మమతను సవాల్ చేసిన ఆమె మాజీ సహచరుడు సువేందు అధికారికి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బగా పరిణమించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తమదే అధికారం అంటూ హంగామా చేసిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలు షాక్ తినిపించాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు ఫలితాలే లభిస్తున్నాయి. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీనైనా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. చివరికి నాలుగు దశాబ్దాలుగా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి కుటుంబం ఏలుబడిలో ఉన్న కాంతి పట్టణం కూడా చేజారిపోయింది. చివరికి ఆ పార్టీ 64 వార్డులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు తిరుగులేని అధికారం చెలాయించిన వామపక్ష కూటమి తాహెర్పూర్ మున్సిపాలిటీలో మాత్రమే విజయం సాధించింది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ కూడా పూర్తిగా చతికిల పడింది.

డార్జిలింగులో తృణమూల్ కు దెబ్బ

రాష్ట్రవ్యాప్తంగా స్వీప్ చేసిన తృణమూల్ కాంగ్రెసుకు డార్జిలింగులో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. ఈ మున్సిపాలిటీలో గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎంఎల్ఎఫ్) మాజీ నేత అజయ్ ఎడ్వర్డ్ నాయకత్వంలోని హమ్రో పార్టీ విజయం సాధించింది. ఒక మున్సిపాలిటీ ఏకగ్రీవం కాగా మిగిలిన 107 మున్సిపాలిటీల్లోని 2171 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీఎంసీ 1603, బీజేపీ 64, సీపీఎం 55, సీపీఐ 3, ఫార్వర్డ్ బ్లాక్ 2 ఆరెస్పీ ఒకటి, కాంగ్రెస్ 52 వార్డుల్లో విజయం సాధించగా ఇతరులు 113 వార్డులను చేజిక్కించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి