iDreamPost

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు!

  • Author singhj Published - 05:29 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 05:29 PM, Sun - 27 August 23
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు!

తిరుమల వెంకన్న దర్శనం కోసం వెళ్లేవారికి ముఖ్య గమనిక. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు పలు సేవల్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు రద్దు చేసింది. శ్రీవారి పవిత్రోత్సవాలను ఇవాళ నుంచి మూడ్రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. దీంట్లో భాగంగా సేనాధిపతి విష్వక్సేనులను ఆలయ మాడవీధుల మీదుగా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ కార్యక్రమం సాగింది.

ఇక, శనివారం నాడు ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్​వరణం నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఆగస్టు 27వ తేదీన పవిత్ర ప్రతిష్ట, ఆగస్టు 28వ తేదీన పవిత్ర సమర్పణ, ఆగస్టు 29వ తేదీన జరిగే పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాంలకరణ లాంటి ఆర్జిత సేవల్ని టీటీడీ బోర్డు మూడ్రోజుల పాటు రద్దు చేసింది.

తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు మూడు రోజుల పాటు తిరుమల వెంకన్న పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఏడాది పొడవునా శ్రీనివాసుడి ఆలయంలో జరిగే పూజలు, అర్చనలు, ప్రత్యేక ఆరాధన సమయంలో భక్తుల నుంచి గానీ, టీటీడీ నుంచి సిబ్బంది వల్ల గానీ కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్వామి వారి ఆలయానికి ఉన్న పవిత్రతకు ఏదైనా లోపం జరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ రకమైన అన్ని దోషాలు తొలగిపోవాలని.. ఆగమ శాస్త్రంలోని నియమాలను అనుసరించి ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. కాగా, ఈ ఉత్సవాలను తొలిసారిగా 1463లో సాల్వ మల్లయ్య దేవరాజా జరిపారని చెబుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి