iDreamPost

తిరుమలలో విషాదం.. బాలికను లాక్కెల్లిన చిరుత!

తిరుమలలో విషాదం.. బాలికను లాక్కెల్లిన చిరుత!

తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలపిరి మెట్ల మార్గం ద్వారా నడక దారిన తిరుమలకు వెళుతున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. తల్లిదండ్రులకు తెలియకుండానే పాపను అడవిలోకి తీసుకెళ్లిపోయింది. అనంతరం తీవ్రంగా గాయపరిచి చంపిపడేసింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని కోవూరు ప్రాంతానికి చెందిన దినేష్‌ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి తిరుపతి వచ్చారు. అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకున్నారు. దినేష్‌ దంపతులతో పాటు వారి పాప రక్షిత కూడా ఉంది.

రక్షిత తల్లిదండ్రులతో కలిసి అలిపిరి మార్గంలో నడుస్తూ వెళుతోంది. అయితే, నరసింహ స్వామి గుడి దగ్గర రక్షిత కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా బాలిక తప్పిపోయిందన్న ఉద్దేశ్యంతో వెతకటం మొదలుపెట్టారు. శనివారం ఉదయం బాలిక మృతదేహం నరసింహ స్వామి ఆలయానికి దగ్గరలో కనిపించింది. ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో అది చిరుత దాడే అని పోలీసులు తేల్చారు. విగత జీవిగా పడిఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురు కనిపిస్తుందనుకున్నామని, ఇలా చిరుత దాడిలో చనిపోతుందని అనుకోలేదంటూ గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇక, అలిపిరి కాలినడక ప్రాంతంలో చిరుత దాడులు ఎక్కువయిపోయాయి. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. షాపు దగ్గర తాతతో కలిసి నిల్చుని ఉన్న బాలుడిపై చిరుత దాడి చేసి, అడవిలోకి తీసుకెళ్లిపోయింది. అనంతరం తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయింది. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడ్ని రక్షించారు. మరి, తిరుమల అలిపిరి మార్గంలో పెరుగుతున్న చిరుత దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి