iDreamPost

ముగ్గురు పెద్ద హీరోలు – ఒకే డిజాస్టర్ – Nostalgia

ముగ్గురు పెద్ద హీరోలు – ఒకే డిజాస్టర్ – Nostalgia

ఇప్పుడంటే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మల్టీ లాంగ్వేజ్ సినిమాగా సాహో గురించి చెప్పుకుంటున్నాం కానీ ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. బ్లాక్ బస్టర్ అయితే అందులో పెద్ద విశేషం ఉండదు కానీ వీటి ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచినప్పుడే వాటి తాలూకు ప్రభావం కొన్నేళ్ల పాటు సదరు హీరో దర్శకుల మీద ఉంటుంది. ఇక ఒకే సినిమాను ముగ్గురు పెద్ద స్టార్లు చేసి అది మూడు భాషల్లోనూ డిజాస్టర్ అయితే దాన్నేమంటారు. ఇది అలాంటిది థే.

1991లో కన్నడలో స్టార్ హీరో కం దర్శకుడిగా దివ్యంగా వెలిగిపోతున్న రవిచంద్రన్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో అప్పటిదాకా ఎవరూ ఖర్చుపెట్టని రేంజ్ లో శాంతి క్రాంతి అనే భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేశాడు. మూడు భాషలకు ముగ్గురు హీరోలు. తెలుగులో నాగార్జున, తమిళ్ లో రజనీకాంత్, కన్నడలో రవిచంద్రన్. అన్ని వెర్షన్లలో జుహీ చావ్లానే హీరోయిన్. వెర్సటైల్ యాక్టర్ అనంత్ నాగ్ మొదటిసారి విలన్ గా చేయడం ఒక సెన్సేషన్. అప్పట్లోనే 10 కోట్లకు పైగా బడ్జెట్ తో దీన్ని తీస్తున్నప్పుడు యావత్ సినిమా పరిశ్రమ దీని గురించే మాట్లాడుకుంది.

అంచనాలకు తగ్గట్టే విడుదలకు ముందే హంసలేఖ సంగీతం మంచి హిట్ అయ్యింది. జనం రిలీజ్ కోసం ఎదురు చూశారు. అనుకున్న తేదీ సెప్టెంబర్ 19 రానే వచ్చింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా మూడు భాషల్లోనూ శాంతి క్రాంతి దారుణంగా ఫెయిల్ అయ్యింది. నెగటివ్ రిపోర్ట్స్ తో అభిమానులు విరుచుకుపడ్డారు. పట్టుమని రెండు వారాలు థియేటర్లో సినిమాను నిలపడం బయ్యర్లకు కష్టమైపోయింది. తీరా చూస్తే 3 కోట్లు వసూలు చేయడమే గగనమై తీవ్ర నష్టాలు మిగిల్చింది.

అనాథ పిల్లల పేరుతో పెద్ద ఆశ్రమం నడుపుతూ వెనుక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే ఒక డాన్ ను అంతమొందించే పోలీస్ ఆఫీసర్ కథే శాంతి క్రాంతి. డ్రామా మరీ శృతి మించడం, అవసరానికి మించి పాటలు ఎక్కువైపోవడం, సెకండ్ హాఫ్ లో అనవసర ప్రహసనాలు ప్రేక్షకులు భరించలేకపోయారు. దెబ్బకు హోల్ సేల్ గా శాంతి క్రాంతి ఆ దశాబ్దపు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీన్నుంచి కోలుకునేందుకు రవిచంద్రన్ కు చాలా ఏళ్ళు పట్టిందని శాండల్ వుడ్ లో చెప్పుకునేవాళ్ళు. కంటెంట్ లో తేడా ఉన్నప్పుడు ఎన్ని భాషల్లో ఎందరు స్టార్లతో తీసినా ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఇంత కన్నా ఉదాహరణ వేరే కావాలా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి