iDreamPost

నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేశం..

నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేశం..

మరో ఐదు రోజుల్లో మూడో విడత లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. లాక్ డౌన్ పొడిగించాలా లేదా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా వైరస్ ను గ్రామాలకు వ్యాపించకుండా చేయాలని సూచించారు.

లాక్ డౌన్ నుంచి ఇప్పటికే పలు అంశాలకు సడలింపు ఇవ్వగా కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం ప్రకటన చేయబోతున్నారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఆర్ధిక ఉద్దీపన చర్యలపై కూడా ప్రధాని మోడీ ప్రకటన చేయనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు నాలుగు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు రాత్రి ఐదోసారి దేశ ప్రజలతో మాట్లాడబోతున్నారు. జనతా కర్ఫ్యూ విధించే ముందు, లాక్ డౌన్ ప్రకటించే ముందు, మొదటి, రెండో దఫా లాక్ డౌన్ పొడిగించే ప్రకటన చేసే ముందు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మూడో దశ లాక్ డౌన్ పొడిగించే ముందు మాత్రం ప్రసంగించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి