అనగనగా అర్జెంటీనా. అక్కడో చిన్న పిల్లాడు తప్పిపోయాడు. నాన్న కోసం ఏడుస్తూ తిరుగుతున్నాడు. అది చూసిన ఓ పెద్దమనిషి తప్పిపోయిన బాబును భుజాల మీదకెక్కించుకున్నాడు. వాళ్ళ నాన్న పేరు అడిగాడు. బాబు ఎడ్వర్డో అని చెప్పాడు. ఆ పేరును ఒక పాటలాగా పాడుతూ ఆయన అటు ఇటు తిరిగాడు. ఇది చూసిన మిగతా వాళ్ళు కూడా ఆ పెద్దాయనతో శ్రుతి కలిపి చప్పట్లు కొడుతూ ఎడ్వర్డోని పిలిచారు. ఆ పక్కనే వీధుల్లో పాటలు పాడుతున్న మ్యుజీషియన్స్ అక్కడికి చేరి అప్పటికప్పుడే ఓ పాట కట్టి వాయించడం మొదలు పెట్టారు. కాసేపటికి ఈ కోలాహలానికి పిల్లాడి తండ్రి ఎడ్వర్డో అటు వైపు వచ్చాడు. తండ్రిని చూడగానే బాబు పరిగెట్టుకుంటూ పోయి వాటేసుకున్నాడు. ఆ తర్వాత పాటగాళ్ళు ఇద్దరినీ చీర్ చేస్తూ పాట కంటిన్యూ చేశారు.
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను కదిలించేసింది. వ్యూస్, లైక్స్ కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడే అర్జెంటీనా వెళ్ళిపోవాలనుందని కొందరు యూజర్లంటే వీళ్ళు మనుషుల మధ్య ఉన్న దేవదూతలంటూ ఇంకొందరు పొగిడారు.