బిగ్‌బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో ఒకరు సొహైల్. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. పురుషుడు గర్భం ధరిస్తే ఎలా ఉంటుందనే వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అయితే ఈ వారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘యోగి’ చిత్రం రీ రిలీజ్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన ‘రఘువరన్ బీటెక్’ కూడా మళ్లీ విడుదలైంది. దీంతో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్ స్లాట్ దొరకడం కష్టమైపోయిందట. ఈ విషయం గురించి సినిమా సక్సెస్ మీట్లో హీరో సొహైల్ చెప్పుకొచ్చారు.
‘మిస్టర్ ప్రెగ్నెంట్’కు సోలో రిలీజ్ దొరికిందని తాము సంతోషపడ్డామని.. అయితే పెద్ద హీరోల సినిమాలు రీ రిలీజ్ కావడంతో వీకెండ్ స్లాట్ దొరకడం కష్టమైపోయిందన్నారు సొహైల్. ‘పెద్ద సినిమాల రీ రిలీజ్లు శుక్రవారం వద్దు. సోమ, మంగళ, బుధవారాల్లో రీ రిలీజ్లు పెట్టుకోవచ్చు. పెద్ద చిత్రాలు లేనప్పుడు చిన్న సినిమాల విడుదలకు ఛాన్స్ దొరుకుతుంది. ఈ విషయంపై నిర్మాతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఓటీటీల్లో కూడా శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా రోజుల్లో చేయొచ్చు కదా? ఒక నటుడిగా నిర్మాతను కాపాడుకునే బాధ్యత నాది’ అని సొహైల్ చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలను బతకనివ్వరా అని ఆవేదన వ్యక్తం చేశారు. రీ రిలీజ్‌లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లయింట్ చేస్తామన్నారు.
ప్రతి హీరో తన సినిమా విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు సొహైల్. నటించడమే కాదు ప్రమోషన్స్ విషయంలోనూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. రీ రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి స్పందిస్తూ.. తమ సినిమా సోలో రిలీజ్ అని చెప్పి చాలా సంతోషపడ్డామన్నారు. అయితే తీరా తేదీ దగ్గరకు వచ్చేసరికి మూడు పెద్ద సినిమా రీ రిలీజ్ అయ్యాయన్నారు. చిన్న సినిమాలను అతికష్టం మీద విడుదల చేస్తుంటే.. రీ రిలీజ్లు చేస్తున్నారని, ఇది చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా మారిందన్నారు.