iDreamPost
android-app
ios-app

మలేషియా ప్రధానిని కలిసిన రజినీకాంత్.. వైరల్ వీడియో!

మలేషియా ప్రధానిని కలిసిన రజినీకాంత్.. వైరల్ వీడియో!

సూపర్ స్టార్ రజినీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను మర్యాదపూర్వకంగా కలిశారు. రజినీకాంత్ మలేషియా ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ప్రధాని అన్వర్ ఇబ్రహీం రజినీకాంత్ ను చూడగానే ఆనందంతో దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రజినీకాంత్ స్టైల్ లో అన్వర్ ఇబ్రహీం సైగ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని స్వయంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

“ఈరోజు ఇండియన్ ఫిల్మ్ స్టార్ రజినీకాంత్ ను కలిశాను. ఆయనకు ఆసియా దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన నాకు ఇచ్చిన మర్యాద నన్ను ఎంతో ఆకట్టుకుంది. ప్రజలు, వారి ఇబ్బందుల గురించి ఆయనతో చర్చించడం జరిగింది. సామాజిక సమస్యలపై మేము చర్చించిన అంశాలను.. ఆయన భవిష్యత్ సినిమాల్లో చూపిస్తే చాలా బాగుంటుంది. ఆయన ఎంచుకున్న ప్రతిరంగంలో రాణించాలని కోరుకుంటున్నాను” అంటూ అన్వర్ ఇబ్రహీం పోస్ట్ చేశారు. మలేషియా ప్రధానిని రజినీకాంత్ కలవడంపై ఇప్పుడు రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. మలేషియా ప్రధానిని రజినీకాంత్ కలవడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ అప్పటి ప్రధాని నజీబ్ రజాక్ ను రజినీకాంత్ కలిశారు.

ఆ భేటీపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. రజినీకాంత్ మలేషియా దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు. కబాలి షూటింగ్ సమయంలో ఆయనను కలవడం కుదరకపోవడంతో.. తర్వాత ఆహ్వానించినట్లు తెలిపారు. మరి.. ఇప్పుడు ఈ భేటీ ఎందుకు అనే దానిపై రజినీకాంత్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇంక రజినీకాంత్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన జైలర్ సినిమాతో రజినీకాంత్ స్టామినీ ఏంటో మరోసారి ప్రూవ్ చేసినట్లు అయింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఒక్క సినిమాతో స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాల రికార్డులను రజినీకాంత్ బ్రేక్ చేశాడు. ఇప్పటికీ జైలర్ సినిమా గురించే చర్చ జరుగుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మూవీ ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించిందో. తాజాగా రజినీకాంత్ 171 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఆ మూవీకి లోకేశ్ కనకరాజ్ దర్శవకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఈ మూవీని కూడా సన్ నెట్ వర్క్ నిర్మిస్తోంది. రజినీకాంత్– లోకేశ్ కనకరాజ్ మూవీకి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు.