iDreamPost
android-app
ios-app

సమాజాన్ని నిలదీస్తున్న గాడ్సే

  • Published Jun 09, 2022 | 1:36 PM Updated Updated Jun 09, 2022 | 1:36 PM
సమాజాన్ని నిలదీస్తున్న గాడ్సే

వచ్చే వారం విడుదల కాబోతున్న విరాటపర్వంతో పాటుగా థియేటర్లలో అడుగు పెడుతున్నాడు గాడ్సే. మహాత్మగాంధిని చంపిన ఉగ్రవాదిగా ముద్రపడిన వ్యక్తి పేరుని సినిమాకు పెట్టుకోవడం దగ్గరి నుంచే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తిని రేపింది. సత్యదేవ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సోషల్ డ్రామా ట్రైలర్ ని ఇందాక గ్రాండ్ గా రిలీజ్ చేశారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరు కాగా ఈ వేడుకని నిర్వహించారు. అంచనాల పరంగా ఏమంత బజ్ లేని గాడ్సేకు ప్రమోషన్ వేగవంతం చేశారు. గత వారం రోజులుగా హీరో దర్శకుడితో పాటు టీమ్ తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు తిరుగుతూ హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ట్రైలర్ సంగతి చూద్దాం.

గాడ్సే సమాజం గురించి పరితపించే యువకుడు. తప్పు జరిగినా, అన్యాయం కళ్లెదుట కనబడినా ప్రశ్నించే తత్వం. రాజకీయ నాయకులు అర్హత ఉంటేనే పదవుల్లో ఉండాలని నిలదీసే ధైర్యం అతనిది. వందల వేల కోట్లను స్కాముల్లో మింగేస్తూ జనం డబ్బుని అన్యాయం దోచేస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఎవరూ చేయలేని సాహసానికి సిద్ధపడతాడు. వ్యవస్థకు ఎదురు తిరిగేందుకు వెనుకాడడు. దీనివల్ల అతని ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా చుట్టూ వలయంలా కమ్ముకొస్తున్న పోలీస్ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతాడు. చివరికి గాడ్సే అనుకున్న లక్ష్యం నెరవేరిందా మార్పు వచ్చిందా అనేది సినిమాలోనే చూడాలి.

సత్యదేవ్ ఎప్పటిలాగే మంచి ఎనర్జీతో అదరగొట్టాడు. డైలాగ్స్ లో కొంచెం సౌండ్ ఎక్కువనిపించినా తన బేస్ కు ఆ మాత్రం ఉండాలనిపించేలా సంభాషణలు పలికాడు. దర్శకుడు గోపీగణేష్ పట్టాభి టేకింగ్ మంచి స్టాండర్డ్ లో ఉంది. శాండీ అద్దంకి సంగీతం, సురేష్ సారంగం ఛాయాగ్రహణం క్వాలీటికి తోడ్పడ్డాయి. కాకపోతే ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామాలు గతంలో చాలా వచ్చిన నేపథ్యంలో గోపి సత్యదేవ్ లు ఇందులో ఎలాంటి విభిన్నతను ప్రయత్నించారో చూడాలి. ఐశ్వర్య లక్ష్మి, జియా శర్మ, బ్రహ్మాజీ, భరణి, నాగబాబు, సిజ్జు, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, పవన్ సంతోష్, నియోల్, పృథ్వి తదితరులు ఇతర తారాగణం.