iDreamPost
iDreamPost
ఇవాళ నాని అంటే సుందరానికితో పాటు విడుదలైన మరో సినిమా 777 ఛార్లీ. కన్నడ చిత్రమే అయినప్పటికీ తెలుగు వెర్షన్ ను సురేష్ సంస్థ విడుదల చేయడం, ప్రత్యేకంగా ప్రీమియర్లు వేయడం లాంటివి మంచి బజ్ నే తీసుకొచ్చాయి.మనకు అతడే శ్రీమన్నారాయణతో పరిచయమైన రక్షిత్ శెట్టి ఇందులో హీరో. అయితే టైటిల్ రోల్ ఓ పెంపుడు కుక్క మీద పెట్టడంతో దీని మీద పెట్ లవర్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ కూడా ఎమోషనల్ గా అనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పెద్ద స్టార్లు హంగులు కోట్ల రూపాయల బడ్జెట్ లు ఉంటేనే సక్సెస్ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో శునకంతో తీసిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
చిన్నతనంలోనే యాక్సిడెంట్ లో తల్లితండ్రులు చనిపోవడం వల్ల ఒంటరి జీవితాన్ని గడిపే ధర్మా(రక్షిత్ శెట్టి)కు ఓ రోజు ఛార్లీ(కుక్క) కనిపిస్తుంది. ముందు ఇష్టం అనిపించకపోయినా తర్వాత దగ్గరకు తీసుకుని పెంచుకోవడం మొదలుపెడతాడు. అనుకోకుండా ఛార్లీతో ధర్మాకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ ఊహించని విధంగా ఛార్లీకు క్యాన్సరన్న సంగతి బయటపడుతుంది. ప్రాణాలతో కాపాడుకోవడం అసాధ్యమని గుర్తించి తనకు ఇష్టమైన చోటికి తీసుకెళ్లాలని ట్రిప్ మొదలుపెడతాడు. ఈ ఇద్దరి ప్రయాణం ఏమైంది, చివరికి ఛార్లీ కన్నుమూశాక ధర్మ జీవితం ఏ మలుపు తిరిగింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.
దర్శకుడు కిరణ్ రాజ్ చేసింది సాహసమే. మనుషులు చేసే ఫీట్లే జనాన్ని మెప్పించలేని ఓటిటి ట్రెండ్ లో, ఇలా కుక్కతో థియేటర్ మూవీని తీయడం అందులోనూ ఎమోషనల్ గా తీర్చిదిద్దడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే వినడానికి ఎంత బాగున్నా ఎగ్జిక్యూషన్ లో మాత్రం కామన్ ఆడియన్స్ కి పూర్తిగా కనెక్ట్ అయ్యేలా ఛార్లీ లేదనే చెప్పాలి. హత్తుకునే సన్నివేశాలు, నవ్వించే సీన్లు, కన్నీళ్లు తెప్పించే ఎపిసోడ్లు ఉన్నాయి. సెన్సిటివ్ ఆడియన్స్ కి ఇవి నచ్చవచ్చు. అయితే సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ ఛార్లీని మరీ గొప్పగా రిసీవ్ చేసుకోలేడు. పెర్ఫార్మన్స్ పరంగా రక్షిత్ శెట్టి సూపర్బ్ అనిపిస్తే కుక్క తానేం తీసిపోలేదని చప్పట్లు కొట్టించుకుంది. అయితే కమర్షియల్ మీటర్ కు ఇలాంటి కాన్సెప్ట్స్ అంత ఈజీగా ఎక్కవు కాబట్టి ఫైనల్ రిజల్ట్ చెప్పలేం. కాకపోతే ఈ ఛార్లీ బ్యాడ్ ఛాయస్ మాత్రం కాదు.