Krishna Kowshik
Krishna Kowshik
ఆనందం అంటే అతడిదే. ప్రభుత్వ ఉద్యోగం. మంచి జీతం. కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇక తన జీవితానికి ఏ లోటు లేదనుకున్నాడు. ఒంటరిగా ఉన్న తన జీవితానికి తోడు కావాలనుకున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతడికి సంబంధాలు చూశారు. చక్కనైన అమ్మాయిని వెతికారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. భూదేవంత పందిరిలో మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు, డీజే హోరులు మోత ఎక్కిస్తుండగా, బంధు గణం, స్నేహితుడు, కుటుంబ సభ్యుల మధ్య వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు. శనివారం ఘనంగా పెళ్లి జరిగింది. సోమవారం రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఊహించని ప్రమాదం.. అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నూతన వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లై ఒక్కరోజు కూడా గడవలేదు. సరిగ్గా తన భర్త ముఖం చూడకుండానే.. ఆ మహిళ విధవరాలిగా మారింది.
చేతినిండా గాజులు, తల నుండా పూలు, నుదిటిన బాసికం, పెళ్లి దుస్తులు తీయనే లేదు.. తాళి కట్టిన భర్త.. పసుపు తాడు కట్టిన కొన్ని గంట్లల్లోనే మృత్యు ఒడికి చేరడంతో వధువు కన్నీటి పర్యంతమౌతుంది. నవ్వులతో నిండిపోయిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లాలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ .. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం అతడి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కావడంతో ఇల్లంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోమవారం రిసెప్షన్ పెట్టుకున్నారు. రిసెప్షన్ నేపథ్యంలో పొద్దునే లేవగా, అంతలో ఫోన్ కాల్ రావడంతో మేడ మీదకు వెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ డెకరేషన్ చేసిన లైట్ వైరింగ్‌కు తగలడంతో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగింది. రిసెస్షన్ రోజే భర్త చనిపోవడంతో ఆ ఇల్లు శోక సంద్రంలో మునిగిపోయింది. చావు అతడ్ని పిలిచినట్లు ఫోన్ రావడం, ఆపై యముడు రూపంలో కరెంట్ అతడ్ని తీసుకుపోవడం జరిగింది. పెళ్లికి వెళ్లి ఆశ్వీరదించిన బంధువులు.. ఇప్పడు అతడి మరణవార్తను విని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.