iDreamPost
android-app
ios-app

అటవీ శాఖ కొత్త చట్టం.. అడవి పందిని చంపితే 5 లక్షల జరిమానా!

అటవీ శాఖ కొత్త చట్టం.. అడవి పందిని చంపితే 5 లక్షల జరిమానా!

గ్రామాల్లో మాంసం కోసం అడవి పందుల్ని వేటాడి చంపి తింటుంటారు. కొన్ని సార్లు పంటలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని, కరెంట్‌ పెట్టి మరీ వాటిని చంపుతూ ఉంటారు. అయితే, అడవి పందుల్ని ఏ విధంగా చంపినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అడవి పందుల్ని చంపినట్లు తెలిస్తే.. కేసుతో పాటు భారీ జరిమానా పడుతుంది. అటవీ శాఖ కొత్త చట్టం ప్రకారం.. అడవి జంతువుల్ని ఏ రకంగా చంపినా కేసుతో పాటు జరిమానా విధించనున్నారు. జరిమానా లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉండనుంది.

తాజాగా, అడవి పంది చావుకు కారణమైన ఓ వ్యక్తికి అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్త పల్లి మండలం ఆదిరాలకు చెందిన ఓ రైతు తన పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయని.. పొలం చుట్టూ విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేశాడు. దీంతో పొలంలోకి రావటానికి ప్రయత్నించిన ఓ అడవి పంది కరెంట్‌ తీగలకు తగిలింది. షాక్‌ కారణంగా అది అక్కడికక్కడే మరణించింది.

దాన్ని అంబట్‌పల్లికి చెందిన వ్యక్తి కొనుక్కుని తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అటవీ శాఖ స్పెషల్‌ పార్టీ వారు పట్టుకున్నారు. అనంతరం కరెంట్‌ పెట్టిన రైతుపై కేసు నమోదు చేయటంతో పాటు లక్ష జరిమానా విధించారు. కాగా, అటవీ శాఖ కొత్త చట్టంతో అడవి పందుల్ని వేటాడేవారికి, తమ పొలాల చుట్టూ కరెంట్‌ తీగలు అమర్చే వారికి చెక్‌ పెట్టే అవకాశం ఉంది. మరి, అడవి పందుల్ని కాపాడేందుకు వచ్చిన కొత్త చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.