SNP
HYDRA Commissioner AV Ranganath: హైడ్రా ఇంత బలంగా, దూకుడుగా పనిచేయడానికి కారణం రంగనాథ్. అందుకే ప్రభుత్వం ఆయనను ఏరి కోరి మరి.. ఈ ఏజెన్సీకి కమిషనర్‌గా నియమించింది. ఈ రంగనాథ్ ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి ఇప్పుడు చూద్దాం..
HYDRA Commissioner AV Ranganath: హైడ్రా ఇంత బలంగా, దూకుడుగా పనిచేయడానికి కారణం రంగనాథ్. అందుకే ప్రభుత్వం ఆయనను ఏరి కోరి మరి.. ఈ ఏజెన్సీకి కమిషనర్‌గా నియమించింది. ఈ రంగనాథ్ ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్ మహా నగరం ఎంతోమంది కడుపు నింపుతుంది. అదే మహా నగరం వాన చుక్క పడితే మోకాళ్ళ లోతు నీటిలో ముంచుతుంది. తప్పు మహా నగరానిది కాదు.. ఇష్టమొచ్చినట్టు చెరువులను పూడ్చేసి, పార్కులను, ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అక్రమ కట్టడాలు కట్టిన వ్యాపారులదే తప్పు. చెరువులను మింగేస్తూ ఇళ్లు, రోడ్లు వచ్చాయి. వాన పడితే ఆ నీరే చెరువులుగా మారి ఇళ్లలోకి, రోడ్ల మీదకు వస్తున్నాయి. ఏది ఏమైనా గానీ ఎవరో చేసిన తప్పుకి అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాన చుక్క పడితే హైదరాబాద్ మునిగిపోతుంది, రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి అని గొంతు చించుకుని అరిచేవారే తప్ప.. పట్టించుకున్న నాథుడు లేకుండా పోయారు ఇన్నాళ్లు. కానీ ఒక్కడు.. ఒకే ఒక్కడు ఈ కదన రంగంలోకి వచ్చాడు. అతనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్.
పూర్తి పేరు ఆవుల వెంకట రంగనాథ్. పుట్టిన ప్లేసు నల్గొండ. సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు 1970లో అక్టోబర్ 22న జన్మించారు. హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన రంగనాథ్.. ఆ తర్వాత గుంటూరులో పదో తరగతి వరకూ చదివారు. ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం ఐడీబీఐ బ్యాంకులో కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షల్లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. అలా 1996 బ్యాచ్ లో డీఎస్పీ ర్యాంకులో స్థిరపడిన రంగనాథ్ కి.. 2000వ సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ 2003 వరకూ పని చేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా, 2004లో ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో పని చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద గ్రేహౌండ్స్ సిబ్బంది నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో రంగనాథ్ ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. 2012 డిసెంబర్ వరకూ ఆ ప్రాంతంలోనే గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా పని చేశారు. ఆ సమయంలో రంగనాథ్ చేసిన కృషికి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. ఆ తర్వాత 2014 వరకూ ఖమ్మం ఎస్పీగా పని చేసి.. ఆ తర్వాత నల్గొండకు బదిలీ అయ్యి అక్కడ నాలుగేళ్లు పని చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్(ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత-ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత పలు విభాగాల్లో పనిచేశారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు ‘హైడ్రా’. పూర్తిగా చెప్పాలంటే.. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రాకు రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమిస్తూ.. స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చింది రేవంత్ సర్కార్. మహానగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి, అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ.. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ.. ఈ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. కబ్జాకోరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది హైడ్రా. ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నా.. ఈ ఏజెన్సీ ఇంత బలంగా, దూకుడుగా పనిచేయడానికి కారణం రంగనాథ్. అందుకే ప్రభుత్వం ఆయనను ఏరి కోరి మరి.. ఈ ఏజెన్సీకి కమిషనర్‌గా నియమించింది. తాజాగా మాదాపూర్‌లోని ఓ ప్రముఖ సినిమా హీరోకి చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ అనే భారీ నిర్మాణాన్ని కూల్చివేయడంతో మరోసారి హైడ్రా పేరు సంచలనంగా మారింది. దాన్ని నడిపిస్తున్న రంగనాథ్ కబ్జాదారులకు సింహస్వప్నంగా మారారు.
జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో కబ్జాకు గురైన భూములను పునరుద్ధరించడం, వాటిలో నిర్మాణం జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 185 చెరువులు కబ్జాలతో కుశించుకుపోయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఆయా చెరువుల ‘బఫర్ జోన్’లలో నిర్మించిన వాటిని అక్రమ కట్టడాలుగా గుర్తించి.. వాటిని కూల్చివేయనుంది.
ప్రభుత్వం వద్ద ఉన్న చెరువుల విస్తీర్ణం, అలాగే పూర్తి నీటి సామర్థ్యం తర్వాత.. 30 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా ఉంటుంది. ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్), ఎఫ్‌ఆర్‌ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవెల్) పరిధి తర్వాత.. 30 మీటర్ల వ్యాసార్థంలో బఫర్ జోన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా నిర్మించినా.. వాటిని హైడ్రా కూల్చివేస్తోంది. ఉదాహరణకు ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్.. పూర్తి నీటి నిలువ సామర్థ్యం 10 ఎకరాలు అనుకుంటే.. ఆ 10 ఎకరాల చుట్టూ.. 30 మీటర్ల వ్యాసార్థంతో ఉండేదే బఫర్ జోన్ అంటారు. మరి హైదరాబాద్ మహానగరాన్ని వరద బారి నుంచి కాపాడేందుకు, ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలు, కుంటలను పునరుద్దరించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న చొరవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.