iDreamPost
android-app
ios-app

ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందిన అంజమ్మ! ఈమె గొప్పతనం ఏంటి?

  • Published Jul 18, 2023 | 12:56 PM Updated Updated Jul 18, 2023 | 12:56 PM
  • Published Jul 18, 2023 | 12:56 PMUpdated Jul 18, 2023 | 12:56 PM
ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందిన అంజమ్మ! ఈమె గొప్పతనం ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన అంజమ్మకు చదువురాదు సరికదా కనీసం బడి ముఖం కూడా ఎప్పుడూ చూడలేదు. అయితేనేం.. సాగులో శాస్త్రవేత్తలను మించిపోయింది. నిజం చెప్పాలంటే వారికే ఆమె సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంది. యువ వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆమె ఒక అనాధికారిక ప్రొఫెసర్‌. అందుకే ఆమెను ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఆమె సేవలను ప్రశంసించింది. అయితే.. ఈ అంజమ్మ ఏం సాధించిందని ఐక్యరాజ్య సమితి మెచ్చుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

63 ఏళ్ల అంజమ్మది సంగారెడ్డి జిల్లా గంగ్వార్, తెలంగాణ , కర్ణాటక సరిహద్దులోని ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది. ఏమీ చదువుకోలేదు. పదేళ్ల వయసులోనే.. సంగప్పతో వివాహం జరిగింది. అప్పట్లో వారికి రెండు పూటలా తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. జీవనం సాగించేందుకు వ్యవసాయ కూలీగా మారింది. మెల్లమెల్లగా కూడబెట్టుకున్న డబ్బుతో ఓ అరెకరం పొలం కొనుగోలు చేసుకుంది అంజమ్మ. ఆ భూమిలో అంజమ్మ-సంగప్ప సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు.

అదే సమయంలో… ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలిగా చేరి, డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాల సాగు చేపట్టింది. ఎంతో కష్టపడి నూతన మెళకువలను తెలుసుకుంటూ, రకరకాల పంటలు వేసింది. ఆమె కష్టం ఊరికే పోలేదు.. అరెకరంతో మొదలైన ఆమె ప్రయాణం.. 30 ఏళ్లలో పది ఎకరాలుగా అభివృద్ధి చెందింది. నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు పండించారు. అలా ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు. ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించదు. రైతులకు ఉచితంగానే ఇస్తుంది. వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్ళీ వాటిని భద్రపరుస్తుంది.

స్థానిక వాతావరణానికి తగినట్టు వివిధ పంటలు పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలిగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. విత్తన సంరక్షకురాలిగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటించింది. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, మహిళా సంఘాల నిర్వహణ వంటి అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకుని ఆ మెళకువలను వారికి కూడా నేర్పించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది సందర్భంగా ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి.. ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది.

డీడీఎస్ డైరెక్టర్‌గా ఈ మధ్య వరకు పనిచేసి.. దివంగతులైన సతీష్ సలహాలు, సూచనలు తనను ముందుకు నడిపించాయని అంజమ్మ చెబుతుంది. చిరుధాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభించడమే కాకుండా.. పశువులు, పక్షులకు కూడా ఇవి మేలు చేస్తాయని వివరిస్తోంది. విత్తన సంరక్షణతో పాటు ప్రజా సేవలోనూ అంజమ్మ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె న్యాలకల్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మరి సాంప్రదాయ సాగులో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అంజమ్మ తెలంగాణలో పుట్టడం రాష్ట్రానికి గర్వ కారణం. అందుకే ఆమెను ‘తెలంగాణ చిరుధాన్యాల మహిళ’ అని అంటుంటారు. మరి అంజమ్మ జీవిత ప్రయాణం, సాధించిన విజయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రపంచ చరిత్రలో రెండోసారి.. ఆమె కాఫీ తాగుతుండగా..