భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. భరతమాత స్వేచ్ఛా సంకెళ్లను తొలగించడానికి, భారతీయులను బ్రిటిషర్ల అరాచక పాలన నుంచి విముక్తి గావించడానికి ఎందరో సమరయోధులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. బ్రిటిషర్ల తుపాకీ తూటాలకు అసువులు బాసిన అమరులను పంద్రాగస్టు రోజు గుర్తుచేసుకుంటాం. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తమ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్‌తో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్యాసింజర్లకూ టికెట్ ధరలో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే వృద్ధులకు టికెట్ ధరలో ఏకంగా 50 శాతం రాయితీని ఇస్తూ డెసిజన్ తీసుకుంది. అలాగే హైదరాబాద్ సిటీలో టీ-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పిల్లలకు ఇదే టికెట్‌ను కేవలం రూ.50కే అందివ్వడం విశేషం. ప్రయాణికులకు టికెట్ ధరలో తాము కల్పిస్తున్న రాయితీలు స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాత్రమే వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇకపోతే, టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ ప్యాసింజర్లకు టి-24 టికెట్ ధర రూ.120గా ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు రూ.100.. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.80గా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరికీ టి-24 టికెట్‌ను రూ.75కే సంస్థ ఇస్తుండగా.. పిల్లలకు రూ.50కే అందిస్తోంది. తెలంగాణలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఒక్క రోజు టికెట్లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ట్వీట్ చేశారు. ఆర్టీసీ ప్రకటించిన ఫ్రీడమ్ డే ఆఫర్ వివరాలను ఆయన వివరించారు. ఈ ఆఫర్ పొందాలంటే ప్రయాణించే సమయంలో సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించాలన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 13, 2023