Dharani
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజునే ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాల్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఆ వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజునే ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాల్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు.. మరో 11 మంది కేబినెట్ మినిస్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీద సంతకం చేశారు.. ఆ వెంటనే దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామక పత్రం అందించారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే.. ప్రగతి భవన్ ముందున్న బారికేడ్లను తొలగించారు. దాన్ని ప్రజా దర్బార్ గా మారుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే.. రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాల్ కు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ కు టీఎస్ఆర్టీసీ, విద్యుత్ సంస్థల అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆర్మూరులో జీవన్ రెడ్డి మాల్ కు చెందిన స్థలం అద్దె, విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థల అధికారులు చర్యలకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ స్థానిక బస్టాండుకు ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7 వేల చదరపు గజాల స్థలాన్ని.. 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం క్రితం జీ-1(జీవన్‌రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాల్స్ ఏర్పాటు చేశారు.
లీజుకు తీసుకున్న స్థలానికి ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో ఆర్టీసి అధికారులు లీజుదారు సంస్థకు నోటీసు ఇస్తూ వచ్చారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో.. గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్ వద్దకు వెళ్లి.. మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు ప్రకటించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అంతేకాక జీవన్ మాల్ లో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. లేకపోతే వారం రోజులలోపు జీవన్ మాల్ సీజ్ చేస్తామని తెలిపారు అధికారులు.
అలానే విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో గురువారం మాల్ కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఈ వ్యవహారాన్ని విద్యుత్‌శాఖ ఏడీఈ శ్రీధర్ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌శాఖ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే.. వెంటనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాల్ కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.