Dharani
Dharani
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల తీరు ఎంత గందరగోళంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రతిష్టాత్మక గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ పేపర్ లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి.. కొన్ని రోజుల క్రితం మరోసారి ఎగ్జామ్ నిర్వహించారు. ఈ క్రమంలో తెలంగాణలో నిర్వహించిన మరో పరీక్షను రద్దు చేస్తూ.. రాష్ట్ర హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసే తప్పుల వల్ల లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు హైకోర్టు రద్దు చేసిన ఆ పరీక్ష ఏదంటే..
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాను.. 2022 సెప్టెంబరు 4న నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలను లేవనెత్తుతూ అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దాంతో సింగరేణి యాజమాన్యం ఇంతకాలం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదల చేయలేదు. ఇక తాజాగా హైకోర్టు ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయడం సంచలనంగా మారింది.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి.. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు ప్రారంభం కాగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు అప్లికేషన్ ప్రాసెస్ ముగిసింది. సెప్టెంబర్ 4, 2022 న పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తం 77,907 మంది పరీక్షకు హాజరు కాగా.. అందరికి ఒకే షిఫ్ట్‌లో ఎగ్జామ్ పెట్టారు. అయితే పరీక్ష జరిగిన రోజునే.. గోవాలో పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సింగరేణి యాజమాన్యం.. ఈ వార్తలను ఖండించింది. ఇక పరీక్ష ముగిసిన రోజు సాయంత్రమే.. అర్హత సాధించిన వారి జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది సింగరేణి యాజమాన్యం.
దానిలో కూడా తప్పులు ఉండటం.. పైగా పరీక్ష జరిగే సమయంలో అభ్యర్థులను తనిఖీ చేయలేదని.. ప్రశ్నాపత్రానికి కూడా ఎలాంటి సీల్ లేదని.. పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష నిర్వహించారని.. ఈ పోస్టులను ముందే అమ్ముకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు విమర్శలు చేశారు. దాంతో హైకోర్టు.. ఉద్యోగాల భర్తీ విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా విచారణ ముగిసిన తర్వాత.. ఈ పరీక్ష నిర్వహణ సరిగా లేనందున.. ఏకంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.