Dharani
Holiday on February 15th in Telangana: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే..
Holiday on February 15th in Telangana: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే..
Dharani
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 15న సెలవుగా ప్రకటించారు. అయితే ఇది ఆప్షనల్ హాలీడే.. అందరికి ఉండదు. ఇంతకు సెలవు ఎందుకు ప్రకటించారు అంటే.. ఆరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటిస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి నాటికి.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి దీనిపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న, అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్‌లో జన్మించారని బంజారాలు నమ్ముతారు. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. జగదాంబకు అత్యంత ప్రియ భక్తుడు. బ్రహ్మచారి అయిన సేవాలాల్.. తన విశిష్ట బోధనలతో ఎంతో కీర్తి, ప్రఖ్యాతులు పొందారు. ఆయన్ను చాలా మంది భక్తులు అనుసరించేవారు. బంజారాల హక్కుల కోసం, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బంజారాల హక్కులను కాపాడటానికి నిరంతరంగా శ్రమించారు.
అంతేకాకుండా ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోనుకాకుండా, ఇతర సంప్రదాయాల్లోకి బంజారాలు మారకుండా చూసేందుకు గాను.. సేవాలాల్ ఎంతగానో కృషి చేసినట్లు చరిత్ర చెబుతుంది. బంజారాలకు సేవాలాల్ చేసిన సేవల కారణంగా.. ఆయన వారికి ఆరాధ్య దైవమయ్యాడు. లిపిలేని బంజారాల భాషకు ఒక రీతిని సమకూర్చింది కూడా సేవాలాల్ మహారాజే కావడం విశేషం.
కోట్లాదిగా బంజారాలు.. స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో వారి ప్రత్యేకతను నిలుపుకుంటూ.. ఒకేరకమైన భాషను మాట్లాడగలుగుతున్నారంటే అది సంత్ సేవాలాల్ కృషి ఫలితమే. దాంతో ఆయన్ను బంజారాలు ఆరాధ్యదైవంగా భావించడమే కాక ప్రతి ఏటా ఎంతో ఘనంగా ఆయన జయంతిని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సేవాలాల్ జయంతి నాడు సెలవుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.