Dharani
Aasara Old Pension: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించింది. మరి ఈనెల నుంచి పెంపు ఉంటుందా అంటే...
Aasara Old Pension: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించింది. మరి ఈనెల నుంచి పెంపు ఉంటుందా అంటే...
Dharani
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందే హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఎన్నికల హామీలు కాకుండా ఇవి ప్రత్యేకం అన్నమాట. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన నాడే.. డిసెంబర్ 7నుంచే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఫైల్ మీద సంతకం చేసింది.
అలానే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటిలానే.. మిగతా హామీలను కూడా వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం అభయహస్తం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రాసెస్ జరుగుతోంది.
ఈక్రమంలో తాజాగా తెలంగాణలో పెన్షన్‌లకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం.. తమను గెలిపిస్తే.. పెన్షన్ పెంచుతామని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షన్ రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పెన్షన్ రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని ఎన్నికల వేళ చెప్పుకొచ్చింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో జనవరిలో పెన్షన్ పెంపు సాధ్యపడలేదు.
ఈ క్రమంలో ఫిబ్రవరిలో ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచుతుందుని.. 4, 6 వేల రూపాయలు ఇస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తోన్న వార్త ఏంటంటే.. ఫిబ్రవరిలో కూడా పాత పద్దతిలోనే అనగా 2 వేలు, 3016 రూపాయలే పెన్షన్ ఇస్తారని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ సొమ్ము జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
ప్రస్తుతం రాష్ట్రంలో 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, దివ్యాంగులు 5,03,613 మంది, బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998.. ఇలా వివిధ వర్గాలవారికి కలిపి మొత్తం 43,96,667 మందికి పెన్షన్‌లు ఇస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.వెల కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇక తాజాగా కొత్త పెన్షన్‌ల కోసం సుమారు 24.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్‌దారులుండగా.. కొత్తవాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉంది. దాని వల్ల ప్రభుత్వంపై మరింత భారం పడనుంది.
ఈనెల కొత్త పెన్షన్లు వస్తాయని భావించిన వారికి నిరాశే ఎదురవ్వనుంది. ఈనెల కూడా పాత పద్దతిలోనే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్‌లకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే అంశంపై స్పష్టత లేనందున పాత తరహాలోనే పెన్షన్ విడుదల చేయనున్నారు అధికారులు. కొత్త పెన్షన్‌ల మంజూరుకు సంబంధించి ఎలాంటి విధివిదానాలు ఖరారు చేయనుందున పాత మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి ఉంటుంది అనే దానిపై స్పష్టత లేదు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో పెన్షన్ పెంపు కూడా ఉంది. అయితే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అంటే మార్చి 7 వరకు ఆరు గ్యారెంటీల అమలకు అవకాశం ఉంది. దాంతో కొత్త పెన్షన్ మొత్తం కూడా వంద రోజుల్లోపు అనగా మార్చి నెల వరకు పెంచవచ్చని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలానే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా మార్చి నుంచి పెన్షన్ ఇస్తారా లేరా అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.