P Venkatesh
P Venkatesh
ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వారి హొదాలను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నర్సింగ్ సిబ్బందికి ఆఫీసర్ హోదా దక్కనుంది. ఎప్పటి నుంచో ఆఫీసర్లుగా గుర్తించబడాలని కోరుకుంటున్న నర్సుల కల సాకారం అయ్యింది. ఈ హోదా మార్పు రేపటి నుంచే (శనివారం) నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో నర్సింగ్ సిబ్బందికి గౌరవంతో పాటు ప్రయోజనాలు కూడా దక్కనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది నర్సులకు ప్రయోజనం కలుగనున్నది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా పరిగణించనున్నారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్‌లను పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.