కంట్రీ డిలైట్‌ డెయిరీపై అధికారుల దాడులు.. నోటీసులు జారీ

కంట్రీడిలైట్‌ డెయిరీకి భారీ షాక్‌ తగిలింది. అనుమతులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నట్లు తేలియడంతో.. తెలంగాణ ప్రభుత్వ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కంట్రీ డిలైట్ తమ పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. కంట్రీ డిలైట్‌ పాల డైయిరీ అనుమతులు లేకుండానే రాష్ట్రంలో నెయ్యి అమ్మకాలు సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.  కంట్రీ డిలైట్‌.. ఫార్మ్ టు హోమ్ అంటూ నిల్వ చేసిన నెయ్యిని వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులకు గుర్తించారు.

తనిఖీల్లో భాగంగా అధికారులు.. రూ.52 లక్షల విలువ చేసే 1,500 లీటర్ల నెయ్యిని సీజ్‌ చేశారు. అంతేకాక కంట్రీ డిలైట్‌ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై కంట్రీ డిలైట్ యాజమాన్యం స్పందించింది. కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో కంట్రీ డిలైట్ నెయ్యి ఉత్పత్తులు నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కస్టమర్లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపించింది.

‘‘ప్రియమైన వినియోగదారులారా.. కొన్ని రోజుల వరకు.. కంట్రీ డిలైట్ నెయ్యిని ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉండదు. హైదరాబాద్‌లో నెయ్యి అమ్మకానికి మా దగ్గర ఉన్న లైసెన్స్‌లు కాకుండా అదనపు లైసెన్స్‌కి అప్లై చేయాలని తెలిసింది. మేము వెంటనే అదనపు లైసెన్స్ కి అప్లై చేసి, 2 వారాల లోపు మీకు నెయ్యిని అందచేయగలమని తెలుపుతున్నాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము’’ అంటూ కంట్రీ డిలైట్‌ డెయిల్‌ తన కస్టమర్లకు మెసేజ్‌ చేసింది.

Show comments