iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌కు దొరికిన యోధుడు! ఆయన జీవితమే ఒక పోరాటం!

  • Published Dec 03, 2023 | 9:02 PM Updated Updated Dec 04, 2023 | 8:13 PM

TS Elections Results 2023, Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దాదాపు 9 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించి.. తెలంగాణను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్‌. అయితే.. ఈ విజయం వెనుక ఉన్న ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ వ్యక్తి పేరు రేవంత్‌ రెడ్డి. అతని జీవితమే ఒక పోరాటం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. తిరిగి తెలంగాణను రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన నాయకుడు.

TS Elections Results 2023, Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దాదాపు 9 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించి.. తెలంగాణను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్‌. అయితే.. ఈ విజయం వెనుక ఉన్న ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ వ్యక్తి పేరు రేవంత్‌ రెడ్డి. అతని జీవితమే ఒక పోరాటం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. తిరిగి తెలంగాణను రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన నాయకుడు.

  • Published Dec 03, 2023 | 9:02 PMUpdated Dec 04, 2023 | 8:13 PM
Revanth Reddy: రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌కు దొరికిన యోధుడు! ఆయన జీవితమే ఒక పోరాటం!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి. రెండు దఫాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని బహుషా.. ఆ పార్టీలోని వాళ్లు కూడా ఓ నెల క్రితం నమ్మి ఉండరు. కేవలం ఒక్క నెలలోనే కాంగ్రెస్‌ వైపు గాలి మళ్లిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక రకమైన వేవ్‌ రావడంతో కాంగ్రెస్‌ గెలిచిందని పొలిటికల్‌ అనలిస్టులు సైతం భావిస్తున్నారు. కానీ, ఇది ఒక్క నెలలో జరిగింది కాదు. దాదాపు 6 ఏళ్లుగా ఓ యోధుడి కష్టం ఉంది.. ఈ విజయం వెనుక. అతని రాకకంటే ముందు కేసీఆర్‌ను ఎదుర్కొనే మొనగాడే లేడనే ధీమా చాలా మందిలో ఉండేది. కానీ, అతనొచ్చాకే.. కేసీఆర్‌ను ఢీ కొట్టే వాడు ఒకడొచ్చాడని చాలా మంది కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం పేరు రేవంత్‌ రెడ్డి.

రేవంత్‌ రెడ్డి.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొ​ండారెడ్డి పల్లి, వంగూర్‌లో 1969 నవంబర్‌ 8న అనుముల నర్సింహ రెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రేవంత్‌.. డిగ్రీ చదువుతున్న సమయంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్‌ నాయకుడిగా పనిచేశారు. అనంతరం ప్రముఖ దివంగత కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహం చేసుకున్నారు. దాదాపు దశాబ్దన్నర కాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

2004లో రేవంత్‌.. టీడీపీలో చేరినా 2006లో స్థానిక ఎన్నికల్లో పార్టీని ధిక్కరించి స్వంతత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. మహబూబ్‌నగర్‌ జెడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ 2008లో ఆయన టీడీపీలో తిరిగి చేరారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు రేవంత్ రెడ్డి. 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, 2018 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. వెంటనే 2019లో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.

 

కాంగ్రెస్‌లోకి రాకముందు.. 2015లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను టీడీపీకి మద్దుతు తెలపాలని, డబ్బుతో కొనుగోలు చేసే ప్రయత్నం చేశారనే ఆరోపణ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత రెడ్డి దూకుడు పెంచి.. డైరెక్ట్‌గా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు. ఇక రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు తెలంగాణ అంటే ఒక్క కేసీఆరే.. అనే భావన ఉండేది. కానీ, తన మాటలతో, రాజకీయ చతురతతో డైరెక్ట్‌గా కేసీఆర్‌, కేటీఆర్‌లను టార్గెట్‌ చేస్తూ.. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వర్షం కురిపిస్తూ.. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించాడు.

Revanth reddy life story

కానీ, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా పార్టీలోకి రాక ముందు ఆంధ్ర పార్టీ నేతగా, చంద్రబాబు మనిషిగా విమర్శలు ఎదుర్కొన్న రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత కూడా.. సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. కాంగ్రెస్‌ విజయం కోసమే పోరాటం చేశారు. కార్యకర్తలకు నేనున్నానే ధైర్యం ఇస్తూ.. పార్టీలోని నేతలను కాపాడుకుంటూ.. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చారు. టీపీసీసీ చీఫ్‌గా నియామకం కాగానే.. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం అయిన గాంధీ భవన్‌కు రంగుల లైట్లతో ముస్తాబు చేసి.. కాంగ్రెస్‌కు కొత్త శోభ రాబోతుందని చెప్పకనే చెప్పారు.

2018 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటూ.. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులను ఏకం చేసుకుంటూ.. కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా మార్చింది రేవంత్‌ రెడ్డే. ఈ మాటను ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసులు, అవమానులు ఎదుర్కొన్న రేవంత్‌ రెడ్డి.. అన్నింటిని తట్టుకుంటూ.. ఒక ఉక్కు మనిషిలా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. ఒక పోరాట యోధుడిలా ఎన్ని అడ్డుంకులు వచ్చినా.. ఎంత మంది ఆయనను వ్యతిరేకించినా.. ఎక్కడా నిరాశ పడకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా ఎట్టకేలకు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.

Revanth reddy life story

ఈ ఎన్నికల్లో రేవంత్‌ తీసుకున్న మరో గొప్ప నిర్ణయం ఏంటంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయడం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఓటమి ఎదురవుతుందని తెలిసినా.. పోటీకి దిగారు. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి ఓడిపోయినా.. కేసీఆర్‌ను రెండో స్థానానికి పరిమితం చేయడంతో ఒక రకంగా రేవంత్‌ విజయం సాధించినట్లే. ఇలా అనేక ఎత్తుపల్లాలతో కేసీఆర్‌ లాంటి రాజకీయ శిఖరంతో పోరాడి.. గెలిచారు రేవంత్‌ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన’ నాయకుడు రేవంత్‌ రెడ్డి.