Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించగానే.. రేవంత్ రెడ్డి ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేయనున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు మూడు రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాలయకు గ్యాస్ సిలిండర్.. అలానే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు మొదలు పెట్టినట్లు సమాచారం.
ఉచిత ప్రయాణం కింద.. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయానికి సంబంధించి అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకం కోసం అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది.. అన్న విషయాలను నలుగురు ఆర్టీసీ అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమవుతుందా అని ఎదురుచూసిన తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనే చెప్పింది. శనివారం(09-12-2023) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. అయితే అన్ని సర్వీసుల్లో అనగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, గ్రామీణ రూట్లలో దీన్ని అనుమతించలేదు. కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. కేవలం ఈ పింక్ బస్సులోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం గురించి హామీ ఇవ్వడమే కాక అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది.
కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని ప్రకటించడమే కాక.. దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే తరహా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లాల పరిధిలో అయితే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయచ్చు. ఈ పథకం కేవలం రాష్ట్ర మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మొదటి వారం రోజులు మహిళలు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం లేదు. కానీ, వారం తర్వాత మాత్రం కచ్చితంగా ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పరిధి వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణం వల్ల రాబోయే రోజుల్లో ఆర్టీసీపై అదనంగా 3 వేల కోట్ల భారం పడనున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అలాగే 7,200 బస్సులను వాడబోతున్నట్లు చెప్పారు. రాబోయే రేజుల్లో మరిన్న బస్సులను కూడా తీసుకొస్తామని తెలిపారు. మరి.. తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన ఉచిత ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.