Dharani
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఓ పథకాన్ని రద్దు చేసింది. ఆ వివరాలు..
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఓ పథకాన్ని రద్దు చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దూకుడుగా ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని బలంగా నిశ్చయించుకుంది. ఈ మేరకు మార్గదర్శలు రెడీ చేయడమే కాక.. లబ్ధిదారుల వివరాలు సేకరించడానికి ప్రజాపాలన పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు.. గత ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని పథకాలను రద్దు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుని జనాలకు భారీ షాక్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ పథకాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని తాజాగా రేవంత్ సర్కారు రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గృహలక్ష్మి స్థానంలో అభయహస్తం (ఇందిరమ్మ ఇండ్లు) పథకం తీసుకురానున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పథకం నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మిని రద్దు చేయడమే కాక లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేశారు.
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం.. గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం అందజేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అంతేకాక ఎన్నికల ముందు ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించింది.
ఈ పథకం అమలు కోసం గత ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడు వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 12 లక్షల దరఖాస్తులు అర్హులుగా తేల్చారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దే ఉండగా.. కొందరికి మంజూరు పత్రాలను సైతం జారీ చేశారు
అయితే తాజాగా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తామని హస్తం పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ.. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకు రానుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ.అయిదు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అదే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మరో రూ.లక్ష అదనంగా ఇస్తామని వెల్లడించింది. దీని కోసమే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది.