Uppula Naresh
Uppula Naresh
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ 14 ఏళ్ల వైష్ణవి అనే బాలిక మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో గుండెలు పగిలేలా ఏడ్చారు. వీరితో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కంటతడి పెట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు వైష్ణవికి ఏం జరిగింది? ఈ బాలిక ఎలా చనిపోయింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలం చౌదర్ పల్లి గ్రామంలో కిష్ణయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి వైష్ణవి (14) అనే కూతురుంది. ఈ బాలిక స్థానిక మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల వైష్ణవికి జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు నారాయణఖేడ్ లోని ఓ ఆస్పత్రికి చేర్పించారు. అక్కడ చికిత్స అందించారు. కానీ, మెరుగైన చికిత్స కోసం గత నెల 29న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వైష్ణవికి చికిత్స అందించారు.
అయినా పరిస్థితి విషమించడంతో వైష్ణవి చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక వైష్ణవి మృతదేహాన్ని అంత్యక్రియలకు వారి సొంతూరుకు తీసుకెళ్లారు. దీంతో ఆ విద్యార్థిని చివరి సారిగా చూసేందుకు ఆమె స్నేహితులు, ఉపాధ్యాయులు వైష్ణవిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది.