విషాదం: గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి!

ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో సంబంధంలేకుండా పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మందిల్లో ఈ గుండె పోటు వస్తోంది. అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించి.. మరుక్షణం విగత జీవులుగా మారిపోతున్నారు. ఇటీవలే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో  ఓ 25 ఏళ్ల యువకుడు వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. ఇలా ఎంతో మంది యువత హార్ట్ ఎటాక్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. తాజాగ ఓ ఇంటర్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన పల్లవి (16) అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. ఈ అమ్మాయి ఖమ్మంలోని ఎస్సాఆర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ పల్లవి ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి వస్తుండేది.  అయితే ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి.. మరణించింది. ఇంటర్ చదువుతున్న పల్లవి ఆదివారం స్పెషల్ క్లాస్ లకు హజరైంది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పల్లవిని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మరణించినట్లు ధృవీకరించారు. పల్లవి కార్డియాక్ అరెస్టు వల్ల అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు.

పల్లవి మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గుండె పోటుతో ఇలా యువత మృత్యువాత పడటంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ఈ ఇంటర్ విద్యార్థిని మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తోందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments