Tirupathi Rao
Tirupathi Rao
ఇటీవలికాలంలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయనే చెప్పాలి. దొంగలు కూడా తెలివిమీరి పోతున్నారు. టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త దారులలో దొంగతనాలు చేసేందుకు పూనుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే పోలీసులకు కూడా అవి సవాలుగా మారుతున్నాయి. కానీ, పోలీసుల పనితీరు చూస్తుంటే.. దొంగతనం చేసిన తర్వాత ఏ దొంగ అయినా దొరికి తీరాల్సిందే అనేలా ఉంటోంది. అయితే వెళ్లిన ప్రతిసారి దొంగతనం సక్సెస్ కావాలని ఏమీ లేదు. అలాగే ఈ దొంగ ప్రయత్నం కూడా విఫలయత్నం అయింది. అయితే పోతూ పోతూ అతను చేసిన పని నవ్వులు పూయిస్తోంది.
ఈ వింత ఘటన మంచిర్యాల జిల్లా నెన్నేలలో జరిగింది. ఓ దొంగ ఊరులో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నించాడు. రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా ఎలాగో బ్యాంకులోకి చేరుకున్నాడు. ఆ తర్వాత క్యాష్ కౌంటర్, డెస్కులు మొత్తం కలియతిరిగాడు. అతనికి అక్కడ ఏమీ దొరకలేదు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ, అతను స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేయలేకపోయాడు. దాంతో దొంగ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతను బ్యాంకులో ఉన్న న్యూస్ పేపర్ పై మార్కర్ తో ఒక నోట్ రాసి వెళ్లాడు. అతనికి అక్కడ ఏమీ దొరకలేదని చెబుతూనే బ్యాంకుపై ప్రశంసలు కురిపించాడు.
అతను పేపర్ పై ఇలా రాశాడు.. “గుడ్ బ్యాంక్.. నాకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకవు” అంటూ దొంగ న్యూస్ పేపర్ పై రాసిపెట్టి వెళ్లాడు. ఇది చూసిన బ్యాంకు ఉద్యోగులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వాళ్లు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ తో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని ప్రయత్నించారు. ఎవరు ఈ పని చేసుంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం స్తానికంగా మాత్రమే కాకుండా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. వీడెవడో భలే దొంగలా ఉన్నాడే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి పనులు చేయండమే కాకుండా.. పట్టుకోవద్దు అంటూ రిక్వెస్ట్ పెడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు.