Uppula Naresh
Uppula Naresh
తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రబుద్ధుడు కన్న తల్లి బతికుండగానే చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించాడు. ఇంతే కాకుండా అదే పోస్టర్లను వాడవాడనా అంటించాడు. అయితే ఇదే విషయం తల్లికి తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించింది. తాజాగా చోటు వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమారుడు తల్లి బతికుండగానే ఎందుకు శ్రద్ధాంజలి పోస్టర్లు అంటించాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ కాలనీలో కౌశల్య అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమెకు రాజు అనే కుమారుడితో పాటు పెళ్లైన కూతురు కూడా ఉంది. అయితే రాజుకు గతంలో వికారాబాద్ జిల్లా ధరూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. రాజు తల్లి కౌశల్య పేరు మీదున్న ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో అనేక సార్లు తల్లిపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే భార్యతో కూడా గొడవ పడడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో తల్లి ఒంటరిగా ఉండడంతో ఆస్తిని తన పేరు మీద రాయించాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఇక కుమారుడి టార్చర్ ను భరించలేక కౌశల్య ధరూర్ లో ఉన్న తన కోడలి వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఈ వృద్ధురాలు కోడలి వద్దే ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె కుమారుడు రాజు, కూతురు ఇద్దరు కలసి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. తల్లి బతికుండగానే చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసి ఆమె పేరు మీదున్న ఆస్తిని కాజేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే తల్లి కౌశల్య చనిపోయినట్టుగా శ్రద్ధాంజలి పోస్టర్లను వేయించారు.
ఇక అదే పోస్టర్లను కాలనీతో అంతటా అంటించారు. వీటిని చూసి కౌశల్య నిజంగానే చనిపోయిందని అందరూ అనుకున్నారు. ఇదే విషయం చివరికి వృద్ధురాలు కౌశల్యకి తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరు మున్నీరుగా విలపించింది. తాజాగా ఆమె స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నేను చనిపోలేదని.., నా కుమారుడు, కూతురు కలిసి నా ఆస్తిని వారి పేరిట రాసుకునేందుకు ఇలా పోస్టర్లను అంటించారని వాపోయింది. తల్లి బతికుండగానే శ్రద్దాంజలి ఫొటోలను అంటించిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.