Karimnagar: పేద బిడ్డల చదువు కోసం.. తన ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని సాయం!

Karimnagar Mtech Student-Free Coaching, Chintala Ramesh: కరీంనగర్‌కు చెందిన రైతు బిడ్డ ఆశ్రిత.. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె విజయం వెనక ఉన్న వ్యక్తి గురించి ఈ కథనం..

Karimnagar Mtech Student-Free Coaching, Chintala Ramesh: కరీంనగర్‌కు చెందిన రైతు బిడ్డ ఆశ్రిత.. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె విజయం వెనక ఉన్న వ్యక్తి గురించి ఈ కథనం..

కరీనంగర్‌కు చెందిన రైతు బిడ్డ ఆశ్రిత గేట్‌లో మంచి ర్యాంకు సాధించి.. ఇస్రో జాబ్‌ వదులకుని మరీ 52 లక్షల ప్యాకేజీతో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించింది అని తెలుసుకున్నాం కదా. ఆమె తల్లిదండ్రలు వ్యవసాయం చేసుకుంటూ.. బిడ్డను చదివించారు. తమలా తమ కుమార్తె కూడా కష్టపడకూడదు అనేది ఒక్కటే వారి ధ్యేయం. ఆ దిశగా ఆమెను ప్రోత్సాహించారు. అయితే వారికి చదువు గురించి పెద్దగా అవగాహన లేదు. ఏ కోర్స్‌ చదవాలి.. ఏం చదివితే బాగుటుంది అనే దాని గురించి వారికి ఏమాత్రం అవగాహన లేదు. కుమార్తె బాగా చదువుతుంది.. ఆమెను ప్రోత్సాహించాలి. ఇది మాత్రమే వారికి తెలిసింది. ఆశ్రిత తన సొంతంగానే బీటెక్‌ వరకు వచ్చింది.

ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వద్దనుకుని.. ఐఐటీల్లో ఎంటెక్‌ చేయాలని భావించింది. ఆ సమయంలో ఆమెకు కనిపించిన ఓ వ్యక్తి కారణంగా ఆశ్రిత జీవితం మలుపు తిరిగింది. ఆ వ్యక్తి ఆశ్రిత ఆశయాన్ని తెలుసుకుని ఆమెకు సరైన దిశానిర్దేశం చేయడం మాత్రమే కాక.. ఉచితంగా గేట్‌ కోచింగ్‌ కూడా ఇచ్చి.. ఆమె లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రొత్సాహించాడు. ఆ వ్యక్తి గైడెన్స్‌లో గేట్‌ కోచింగ్‌ పూర్తి చేసిన ఆశ్రిత.. ఆల్‌ ఇండియా లెవల్లో 36వ ర్యాంక్‌ సాధించి.. ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వచ్చిన జాబ్‌ ఆఫర్‌ వదులుకుని మరీ.. ఓ ప్రైవేటు కంపెనీలో ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆశ్రిత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి గురించి ప్రత్యేక కథనం మీ కోసం..

ఆశ్రిత విజయం వెనక ఉన్న వ్యక్తి.. పేరు చింతల రమేష్‌. కరీనంగరలో రిగా అకాడమీ స్థాపించి.. ఉచితంగా గేట్‌ కోచింగ్‌ ఇస్తూ.. పేద విద్యార్థులు.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తన తోడ్పాటు అందిస్తున్నారు. రమేష్‌ విషయానికి వస్తే.. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. సింగరేణి కార్మికుని ఇంట జన్మించిన రమేష్‌ పట్టుదలతో చదివి.. ఎంటెక్‌ పూర్తి చేసి.. ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌కు ఎంపికై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం సంపాందించాడు. జూనియర్ టెలికాం ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. స్వల్ప కాలమే ఉద్యోగంలో కొనసాగిన ఆయన 2019లో కరీంనగర్ లో ఉచిత కోచింగ్ సెంటర్  ప్రారంభించారు

దీనిలో గేట్‌ కోచింగ్‌తో పాటు.. ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలనే దానిపై కూడా అవగాహన కల్పిస్తారు. తొలి ఏడాదే రమేష్‌ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్న ఇద్దరు విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. వారిలో ఒక అమ్మాయి ఐఈఎస్‌లో ఆల్‌ ఇండియా 10వ ర్యాంకు సాధించి.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తుండగా.. మరో అబ్బాయి 527 ర్యాంకు సాధించి మిడియా టెక్‌ కంపెనీలో రూ.25 లక్షల ప్యాకేజీ అందుకున్నారు. ఇక తాజాగా ఆశ్రిత 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరింది. గత రెండేళ్లలో రమేష్‌ వద్ద శిక్షణ పొందిన వారిలో 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా.. మరో 25 మంది వరకు వివిధ కంపెనీల్లో మంచి జాబ్స్‌ సాధించారు.

బ్యాచ్‌కు 30 మందిని మాత్రమే తీసుకోవాలని భావించినప్పటికి.. విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంతో.. 50 మందిని తీసుకుని.. వారికి ఉచితంగా కోచింగ్‌ ఇచ్చి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు రమేష్‌. ఇలాంటి గురువు ఉంటే.. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని.. నిజంగానే పేద బిడ్డల పాలిట వరంగా మారారు. మంచి కెరీర్‌ను వదులుకుని.. విద్యార్థుల కోసం ఆలోచించిన రమేష్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు.

Show comments