గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్‌కు ఎంపికపై TGPSC క్లారిటీ

Group 1 Prelims: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

Group 1 Prelims: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. పోటీ పరీక్షల నిర్వహాణలో అనేక లోపాలు తలెత్తాయి. పేపర్లు లీక్‌ కావడం మొదలు.. ఫలితాల వెల్లడిలో లీగల్‌ సమస్యల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిరుద్యోగులు. దాంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణ ఎంత దారుణంగా జరిగిందో చూశాం. రెండు సార్లు పరీక్ష రద్దు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బీఆర్‌ఎస్‌ ఓటమికి.. కాంగ్రెస్‌ గెలుపుకు కారణం అయ్యాయి.

ఇక నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్‌ పార్టీ.. వారి కోసం అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. ముందుగా రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే టీజీపీఎస్‌సీ బోర్డను రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త దాన్ని, సభ్యులను నియమించారు. కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

టీజీపీఎస్‌సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు, నిరాహార దీక్షలు ప్రారంభించారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదని తాజా నిర్ణయంతో అర్థం అవుతోంది. కారణం తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ తాజాగా స్పష్టత ఇచ్చింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. మరి ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షకు జూన్‌ 9న నిర్వహించారు. మొత్తం 563 గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి సుమారు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే జూన్ 9న నిర్వహిమచిన ప్రిలిమినరీ పరీక్షకు కేవలం 3,02,172 మంది (74.86 శాతం) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు లక్ష మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాలేదు.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్‌సీ స్పష్టం చేసింది. దీని ప్రకారం మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌ పరీక్షకు మొత్తం 28,150 మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్‌ 21-27వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు హైదరాబాద్‌ పరిధిలో నిర్వహించనున్నారు. ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధి ఉంటుంది. ఒక్కోపేపర్ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

Show comments