iDreamPost
android-app
ios-app

Hyderabad వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.5కే టిఫిన్‌.. పూర్తి వివరాలివే

  • Published Jul 19, 2024 | 12:16 PMUpdated Jul 19, 2024 | 12:16 PM

Hyderabad Annapurna Canteens-Rs 5 Tiffin: హైదరాబాద్‌ వాసులకు భారీ శుభవార్త.. త్వరలోనే 5 రూపాయలకు టిఫిన్‌ తినే అవకాశం కలగబోతుంది. ఎలా అంటే..

Hyderabad Annapurna Canteens-Rs 5 Tiffin: హైదరాబాద్‌ వాసులకు భారీ శుభవార్త.. త్వరలోనే 5 రూపాయలకు టిఫిన్‌ తినే అవకాశం కలగబోతుంది. ఎలా అంటే..

  • Published Jul 19, 2024 | 12:16 PMUpdated Jul 19, 2024 | 12:16 PM
Hyderabad వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.5కే టిఫిన్‌.. పూర్తి వివరాలివే

ఆకలి బాధ ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. 20వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు, కేకలు వినిపిస్తున్నాయి అంటే.. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. నేటికి కూడా ప్రభుత్వాలు.. పేదల ఆకలి తీర్చడం కోసం ఉచిత రేషన్‌ అందిస్తున్నాయి. అలానే అతి తక్కువ ధరకే భోజనం కూడా అందిస్తున్నాయి. అది కూడా అత్యంత తక్కువ ధరకు. నేటికి కూడా మన సమాజంలో ఎందరో అస్సలు డబ్బుల తీసుకోకుండా.. లేదంటే రూపాయి, 5 రూపాయలకే అన్నార్తుల ఆకలి తీరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ వాసులకు భారీ శుభవార్త చెప్పారు. కేవలం 5 రూపాయలకే టిఫిన్ తినే అవకాశం కలగనుంది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో పేదల ఆకలి తీర్చేందుకు .. ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా నగరంలోని  పలు ప్రాంతాల్లో 5 రూపాయలకే మధ్యాహ్నం పూట కడుపునిండా భోజనం పెడుతున్నారు. ఎందరో అనాథలు, పేదలకు అన్నపూర్ణ కేంద్రాలు వరంగా మారాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా.. కేవలం మధ్యాహ్నం భోజనం మాత్రమే అందిస్తుండగా.. త్వరలోనే.. ఉదయం టిఫిన్‌ కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో.. అన్నపూర్ణ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలానే టిఫిన్‌ను కూడా అందిచేందుకు సాయం చేయాల్సిందిగా కోరుతూ.. అధికారులు హరేకృష్ణ ఫౌండేషన్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

మెనూ ఇదే..

త్వరలోనే జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాల్లో ఉదయం పూట 5 రూపాయలకే టిఫిన్‌ అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే మెనూలో ఉప్మా, టమాటా బాత్‌, ఇడ్లీ, వడ వంటి టిఫిన్‌లు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అంటున్నారు. అలానే మధ్యాహ్నం భోజనం తరహాలోనే టిఫిన్‌కు కూడా 5 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ కేంద్రాల్లో రూ.5కే భోజన పథకం విజయవంతం కావడంతో.. టిఫిన్ కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం కస్టమర్లు రూ.5 చెల్లిస్తే.. మిగతా భారాన్ని జీహెచ్‌ఎంసీ భరించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 373 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో డబ్బాలు పాడైపోవడంతో.. 53 కేంద్రాలు మూతపడ్డాయి. ఇక మిగిలిన 320 మాత్రం కొనసాగుతున్నాయి.. ఈ కేంద్రాల్లో రోజూ దాదాపు 40 వేల మందికిపైగా రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఈ భోజనానికి సంబంధించి జనాల నుంచి రూ.5వసూలు చేస్తుండగా.. బల్దియా రూ.23 భరిస్తోంది. అంటే జీహెచ్‌ఎంసీ మొత్తంగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు ఒక్కో భోజనానికి రూ.28 చెల్లిస్తోంది. అలాగే నగరంలోని పలు అన్నపూర్ణ కేంద్రాల దగ్గర కూర్చుని తినే సదుపాయం కూడా ఉంది. ఇక కరోనా సమయంలో మధ్యాహ్నం, రాత్రి పూట కూడా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనం వడ్డించారు. ఫోన్ చేస్తే ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆహారం ఇవ్వడంతో పాటూ శిబిరాల్లో ఉండే కార్మికులకు కూడా భోజనం అందించారు. ఇక త్వరలోనే టిఫిన్‌ కూడా పెడితే.. ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి