ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత.. అధికారులపై దాడి.. 50మంది అరెస్ట్

Kodangal: కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు తలపెట్టిన గ్రామ సభ రణరంగంగా మారింది. రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో 50 మందిని అరెస్ట్ చేశారు.

Kodangal: కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు తలపెట్టిన గ్రామ సభ రణరంగంగా మారింది. రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో 50 మందిని అరెస్ట్ చేశారు.

తెలంగాణలో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. ఇటీవల హిందూ ఆలయాలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం నెల రోజుల పాటు 144 సెక్షన్ ను ప్రకటించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే ఇప్పుడు రైతుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. ఫార్మా పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. తమ భూములను ఔషద పరిశ్రమకోసం ఇవ్వబోమంటూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో హైటెన్షన్ క్రియేట్ అయ్యింది.

ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేసేందుకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ రణరంగాన్ని సృష్టించింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై రైతులు దాడులకు పాల్పడ్డారు. రైతులు కోపోద్రిక్తులై అధికారులను గ్రామాల నుంచి తరిమికొట్టారు. పోలీసు బలగాలు మోహరించి ఉన్నా కూడా రైతులు వెనకడుగు వేయలేదు. సీఎం ఇలాకాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తమ భూములను లాక్కుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడి ధ్వంసం చేశారు. ఔషధ పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలు సుమారు 200 పైగానే ఉన్నాయి.

భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా భూమికి రూ. 10 లక్షల పరిహారం, 120 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, అర్హతను బట్టి ఔషధ పరిశ్రమలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే తమకు జీవనాధారమైన భూమిని కోల్పోతే ఇక తమకు భవిష్యత్తు లేదని పలువురు రైతులు ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. తమ భూములను ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఫార్మా కంపెనీలకు భూమిలిచ్చే ప్రసక్తే లేదు.. భూముల కోసం ఎంతకైనా తెగిస్తాం అం టూ సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని రైతులు తెగేసి చెబుతున్నా సర్కారు మొండిపట్టు వీడలేదు. ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభ అంటూ భూముల సేకరణకు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు.

లగచర్లలో అధికారులపై దాడిఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుద్యాల, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లగచర్లలో పోలీసులు భారీగా మోహరించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు పోగొట్టుకోవడానికా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది అంటూ సీఎం రేవంత్ పై మండిపడుతున్నారు.

Show comments