తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. అదే సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడలు, వ్యూహాలు రచిస్తూ బిజీ అయిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ఓట్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఆ దిశగా దృష్టి సారిస్తోంది. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఎంప్లాయీస్ నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ చేయడం కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదే సమయంలో ఇంట్రిం రిలీఫ్ (ఐఆర్)ను కూడా సర్కారు ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కావాలని అనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ పీఆర్సీని 2018 జులైలో ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ గడువు ఈ సంవత్సరం జూన్ ఆఖరుతో ముగిసింది. దీంతో నూతన పీఆర్సీ జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
గత పీఆర్సీ కమిషన్ గడువు ముగియడంతో నూతన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఐఆర్ పైనా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఈహెచ్ఎస్ పై కూడా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈహెచ్ఎస్ అమలుకు విధివిధాలను రూపొందించనుందని సమాచారం. దీంతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ మీద కూడా సర్కారు కీలక ప్రకటన చేయనుందని తెలిసింది. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.