తెలంగాణ సర్కార్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. పలు సంస్కరణలు తీసుకోస్తూనే ఉంది. అలాగే ఉద్యోగుల బాగోగుల గురించి పట్టించుకుంటూ.. వారికి అవసరమైన అంశాలకు సంబంధించిన సమస్యలను తీరుస్తూనే ఉంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ఆ ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆశావర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న ఆశావర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఫోన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హరీష్ రావు తెలిపారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది తెలంగాణ సర్కార్. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా జీతాల పెంపు ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర రాష్ట్రాల్లో స్కాంలు ఉంటాయి.. కానీ తెలంగాణలో స్కీమ్ లు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటారు ఆశావర్కర్లు. అలాంటి వారికి స్మార్ట్ ఫోన్లు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్.
ఇదికూడా చదవండి: 40 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన టీచర్ కు ప్రభుత్వం సన్మానం!