చైనా కంపెనీకి చుక్కలు చూపించిన తెలంగాణ వ్యక్తి.. రూ.10 లక్షలు కట్టించాడు!

China Company To Pay 10 Lakhs To Telangana Customer: చైనాకి చెందిన ఎలక్ట్రిక్ కంపెనీకి కన్జూమర్ కోర్టు షాకిచ్చింది. తెలంగాణ వాసికి రూ.10లక్షలు కట్టాలని ఆదేశించింది.

China Company To Pay 10 Lakhs To Telangana Customer: చైనాకి చెందిన ఎలక్ట్రిక్ కంపెనీకి కన్జూమర్ కోర్టు షాకిచ్చింది. తెలంగాణ వాసికి రూ.10లక్షలు కట్టాలని ఆదేశించింది.

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ద్విచక్రవాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఆదరణ బాగా పెరుగుతోంది. ఇప్పటికీ వాటిని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులకు ఎక్కడో ఒకచోట భయం అయితే ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు కాలిపోతాయనే ఆందోళన అందరిలో ఉంటుంది. ఎందుకంటే 2022- 2023 సంవత్సరాల్లో ఈవీలు పెద్దఎత్తున కాలిపోయాయి. చాలామంది కస్టమర్స్ ఆ సమయంలో ఈవీ అంటేనే బెంబేలెత్తిపోయారు. అలా కాలిపోయిన వాటి సంగతి ఏంటనే ప్రశ్న అందిరకీ ఉంటుంది. నిజానికైతే కంపెనీ అందుకు పరిహారం చెల్లిచాల్సి ఉంటుంది. అలా ఒక చైనా కంపెనీ చేయకపోవడంతో తెలంగాణకు చెందిన వ్యక్తి ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు.

విద్యుత్ వాహనాలు కాలిపోయిన పరిస్థితుల్లో గ్యారెంటీ, ఇన్సూరెన్స్ ఉంటే మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కంపెనీల వైపు నుంచి కూడా పొరపాట్లు ఉన్నాయి కాబట్టే కంపెనీలు వినియోగదారుల నష్టాలను పూడ్చాయి. అయితే ఒక చైనా కంపెనీ మాత్రం వినియోగదారుడి గోడు పట్టించుకోలేదు. అతని ఆవేదనను బేఖాతరు చేసింది. ఇంకేముంది ఆ కస్టమర్ న్యాయపోరాటానికి పూనుకున్నాడు. ఆ కంపెనీని కమిషన్ ముదుకు లాగడమే కాకుండా.. రూ.10 లక్షల ఫైన్ పడేలా చేశాడు. ఇప్పుడు ఈ తెలంగాణ వ్యక్తి చేసిన పని ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తోంది. అసలు ఏం జరిగిందో చూద్దాం.

తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన విద్యుత్ స్కూటర్ ను 2021, ఏప్రిల్ 7న కొనుగోలు చేశాడు. ఆ స్కూటర్ కూడా సజావుగానే పనిచేస్తోంది. 2023, ఫిబ్రవరి 26న ఎప్పటిలాగానే బండికి ఛార్జింగ్ పెట్టాడు. కానీ, తెల్లారికి మొత్తం బండి కాలిపోయింది. బండి కాలిపోవడం మాత్రమే కాకుండా.. ఆ ఘటన వల్ల ఇల్లు మొత్తం పొగ వ్యాపించింది. దాంతో తనకు, తన కుటుంబ సభ్యులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని చెప్పాడు. ఈ సందర్భంగా తన విద్యుత్ వాహనం కాలిపోవడం మాత్రమే కాకుండా.. కుటుంబం మొత్తం క్షోభ అనుభవించింది. తనకు జరిగిన నష్టాన్ని సదరు వినియోగదారుడు డీలర్ కు తెలియజేశాడు. డీలర్ కు సంబంధించిన వ్యక్తి కాలిపోయిన బండి ఫొటోలు కూడా తీసుకుని వెళ్లారు.

ఎన్నిరోజులు ఎదురుచూసినా కంపెనీ నుంచి గానీ, డీలర్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. విసుగు చెందిన వ్యక్తి.. తన లాయర్ ద్వారా తయారీ కంపెనీకి, డీలర్ కు నోటీసులు పంపించాడు. అయితే వాళ్లల్లో ఎవరూ కమిషన్ ముందు హాజరు కాలేదు. డీలర్ నిర్లక్ష్యం, కంపెనీ నాసిరకమైన పరికరాలు ఉపయోగించిన కారణంగా కోర్టు జరిమానా విధించింది. వినియోగదారుడికి రూ.10 లక్షల నగదు, రూ.10 వేల ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ స్కూటర్ ధరను చెల్లించాలని లేదంటే.. స్కూటర్ ని భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ వార్త తెలుసుకున్న వాళ్లు కూడా చైనా కంపెనీకి తగిన శాస్తి జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంపెనీని కోర్టుకు ఈడ్చి జరిమానా పడేలా చేసిన తెలంగాణ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.

Show comments