చద్దన్నం వద్దనందుకు తండ్రిపై కొడుకులు దాష్టీకం

వారసుడని, ఇంటి పేరు నిలబెట్టేది కొడుకు అని భావిస్తుంటారు పేరెంట్స్. పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకుని బలంగా నమ్ముతుంటారు. కొడుకు పుట్టాలని ఎన్నో మొక్కులు మొక్కుతుంటారు.. కానీ చివరకు ఆ కొడుకులే..

వారసుడని, ఇంటి పేరు నిలబెట్టేది కొడుకు అని భావిస్తుంటారు పేరెంట్స్. పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకుని బలంగా నమ్ముతుంటారు. కొడుకు పుట్టాలని ఎన్నో మొక్కులు మొక్కుతుంటారు.. కానీ చివరకు ఆ కొడుకులే..

కూతురు కన్నా కొడుకంటే తల్లిదండ్రులకు కాస్తంత ప్రేమ ఎక్కువ. వారసుడని, ఇంటి పేరు నిలబెట్టేది కొడుకేనని భావిస్తుంటారు. తమను పున్నామ నరకం నుండి తప్పించేది అతడే అని బలంగా నమ్ముతుంటారు. కానీ అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడు కాదని నిరూపిస్తున్నారు పుత్రులు. పున్నామ నరకం పక్కన బెడితే.. తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు కొంత మంది తనయులు. దీనికి ఉదాహరణ ఈ సంఘటన. వృద్ధాప్యంలో చంటిబిడ్డలా చూడాల్సిన తండ్రిని హింసకు గురి చేస్తున్నారు కొడుకులు. కుక్క కంటే హీనంగా చూస్తూ నరక యాతన చూపిస్తున్నారు. తండ్రి ఆశగా.. కాస్తంత మంచి భోజనం పెట్టమన్నందుకు అగ్గిమీద గుగ్గిలం కావడంతో పాటు చితకబాదారు కొడుకులు. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది.

మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన నాయక కృష్ణయ్య, మద్దమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కూతురు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆస్తి పాస్తులు పంచి ఇచ్చారు. మద్దమ్మ కొన్నేళ్ళ క్రితం చనిపోగా.. కృష్ణయ్య పోషణ భారం కొడుకులు మీద పడింది. అయితే కృష్ణయ్య కొన్ని రోజుల నుండి చిన్న కొడుకు దగ్గరే ఉంటున్నాడు. మారు మాట్లాడకుండా కొడుకు, కోడలు పెట్టింది తిని బతుకు ఈడుస్తున్నాడు. అయితే ఓ రోజు భోజనానికి కూర్చొన్న మామయ్యకు కోడలు చద్దన్నం వడ్డించింది. వేడి అన్నం ఉంటే పెట్టమ్మా..? ఈ చల్లన్నం తినలేకపోతున్నానని కోరాడు. దీంతో ఒక్కసారిగా కోడలికి చిర్రెత్తుకొచ్చి మామ మీద శివ తాండవం చేసింది. అక్కడే ఉన్న కొడుకు కూడా భార్యకు సర్ది చెప్పాల్సింది పోయి.. తండ్రిపై గొడవకు దిగడంతో పాటు కర్రతో దాడి చేశాడు. వీపు భాగం, కాళ్లపై వాతలు తేలేలా కొట్టాడు. అంతలో సమీపంలో ఉన్న పెద్ద కొడుకు సైతం తండ్రిపై చేయి చేసుకున్నాడు.

తండ్రి అని కూడా చూడకుండా కొడుకులిద్దరూ తనపై దాడి చేయడంతో.. ప్రాణ భయంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు కృష్ణయ్య. అర్థరాత్రి.. చలిలో ఒంటరిగా.. ఆరు కిలో మీటర్లు నడచుకుంటూ మానవపాడు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కుమారులు కొట్టిన దెబ్బలు నొప్పి పెడుతున్నా.. పంటి బిగువున బరాయిస్తూ.. చలిలో అక్కడే నిద్రించాడు. పొద్దున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి.. ఆస్తి పాస్తులు అప్పజెప్పామని వాపోయాడు. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో కూడా కొంత డబ్బు ఇస్తామని కొడుకులు మాట ఇచ్చారని, కానీ ఇప్పుడు ఇవ్వడం లేదంటూ, ఆ డబ్బులు ఇప్పించాలంటూ వేడుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపడుతున్నారు. మగ బిడ్డ పుట్టాలని ఎన్నో మొక్కులు మొక్కుతుంటారు. గుళ్లు, గోపురాలు తిరుగుతుంటారు. చనిపోయినప్పుడు తలకొరివి పెట్టి.. పున్నామ నరకం నుండి తప్పిస్తారని భావిస్తుంటారు.. కానీ ప్రత్యక్షం నరకం చూపిస్తున్నారు పుత్రులు.

Show comments