రెండ్రోజుల గ్యాప్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు పాము కాటుకు గురయ్యారు. స్టూడెంట్స్పై పగబట్టిన మాదిరిగానే పాఠశాలకు పాములు వస్తుండటంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మినీ గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం స్కూలు వరండాలో కూర్చొని చదువుకుంటున్న నాలుగో తరగతి స్టూడెంట్ నిఖితను పాము కాటేసింది. దీంతో ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో గట్టిగా కేకలు వేసింది. చిన్నారికి పాము కాటు వేసిందనే విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ తనకు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి బాలికను తరలించారు. చిన్నారి నిఖితను కాటు వేసిన పామును స్కూలు సిబ్బంది చంపేశారు.
ఆ పామును చంపేసినా గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఈ నాలుగు పాముల్లో అక్కడి నుంచి రెండు వెళ్లిపోగా.. మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా.. రెండ్రోజుల కింద నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుజూసింది. పోతంగల్ మండలం, జల్లాపల్లి గవర్నమెంట్ స్కూలులో నందిని అనే విద్యార్థినిని పాము కాటు వేసింది. కిటికీలో నుంచి బుక్ బయట పడటంతో తీసుకోవడానికి వెనుక వైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటు వేసింది. పాఠశాలలో వరుస పాము కాటు ఘటనలతో అక్కడి విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూలులో ఏ క్షణంలో ఎక్కడి నుంచి పాములు వచ్చి కాటు వేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలతో పాటు వారి పేరెంట్స్ కూడా పాముల ఘటనల గురించి తెలిసి భయపడుతున్నారు.