P Venkatesh
Telangana DSC: తెలంగాణలో ఉపాధ్యాయుల తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగ నియామక పత్రాలు అందించి పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాత షాక్ ఇచ్చారు. నెల తిరగకుండానే జాబ్ నుంచి తొలగించారు. ఎందుకంటే?
Telangana DSC: తెలంగాణలో ఉపాధ్యాయుల తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగ నియామక పత్రాలు అందించి పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాత షాక్ ఇచ్చారు. నెల తిరగకుండానే జాబ్ నుంచి తొలగించారు. ఎందుకంటే?
P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. గత నెలలో దసరా పండగకు ముందు రేవంత్ సర్కార్ డీఎస్సీలో ర్యాంక్ పొందిన వారికి నియామక పత్రాలు అందజేసింది. ఎన్నో ఏళ్లుగా టీచర్ జాబ్స్ కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఉద్యోగాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో బోధన ప్రారంభించారు. అయితే తెలంగాణలో టీచర్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొంతమందికి నిరాశ మిగిల్చింది. ఇటీవల ఓ యువతి డీఎస్సీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైంది. ఆమె అధికారుల తప్పిదంతో ఉద్యోగావకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
దీనిపై స్పిందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇదే రీతిలో ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. డీఎస్సీలో ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తున్న వారికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జాబ్ లో జాయిన్ అయి నెల తిరగకుండానే ఏడుగురు హిందీ పండిట్లను విధుల నుంచి తొలగించారు. రేయింభవళ్లు చదివి ఉద్యోగాలు పొందిన వారి ఆశలు ఉద్యోగంలో చేరిన 20 రోజుల్లోనే అడియాశలయ్యాయి. విద్యార్హత సర్టిఫికెట్లు చెల్లవంటూ ఖమ్మం జిల్లాలో ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను హఠాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారు. రాత్రికిరాత్రే వారి స్థానాలను వేరే అభ్యర్థులతో భర్తీ చేశారు. ఉద్యోగుల తొలగింపు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో టీచర్ అభ్యర్థులు నష్టపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామక పత్రాలు అందించి.. పోస్టింగ్స్ ఇచ్చి తమను ఇప్పుడు అనర్హులు అనడం ఏంటని ఉద్యోగం కోల్పోయిన వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 హిందీ ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నిర్వహించారు. మెరిట్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైన 9 మందిని ఎంపిక చేశారు. 20 రోజులుగా వీరంతా తమకు కేటాయుంచిన పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో ఏడుగురు ఉపాధ్యాయులు సమర్పించిన ధ్రువపత్రాలు నిబంధనల ప్రకారం లేవనే కారణంతో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరి నియామకాలను సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్ కు, డీఈవోకు ఫిర్యాదు చేశారు. డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని.. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన అధికారులు డాక్యూమెంట్ వెరిఫికేషన్ సరిగా చేయలేదని, అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారని గుర్తించారు. దీంతో ఏడుగురు హిందీ పండిట్లపై వేటు పడింది. మయూరి నాగేశ్వరరావు (మధిర సీపీఏ పాఠశాల), సట్టు రామలింగయ్య (బనిగండ్లపాడు), షేక్‌నాగుల్‌మీరా (కందూరు జడ్పీహెచ్‌ఎ్‌స), దోర్నాల లావణ్య, (చిలుకూరు జడ్పీహెచ్‌ఎ్‌స), తాటికొండ నాగలక్ష్మి (పాలేరు జడ్పీహెచ్‌ఎ్‌స), తాటికొండ శ్రీదేవి (రేమిడిచర్ల జడ్పీహెచ్‌ఎ్‌స), మొండేటి వెంకటరత్నం (తుమ్మలపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స) ఉద్యోగాలు కోల్పోయారు.
దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మద్రాస్ నుంచి పొందిన డిగ్రీ సర్టిఫికెట్లు చెల్లవని అందుకే వారిని తొలగించినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అధికారుల తప్పిదంతో జాబ్ కోల్పోయిన వారు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.