Tirupathi Rao
Tirupathi Rao
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 6,500 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న విషయాన్ని మంత్రి తెలియజేశారు. ఈ పోస్టుల్లో 5.089 పాఠశాల విద్యలో ఉండగా.. 1,523 పోస్టులు ప్రత్యేక విద్యార్థుల పాఠశాలలకు సంబంధించి ఉన్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను కేవలం రెండే రోజుల్లో జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారని తెలిపారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. “విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారు. గురుకులాల్లో ఇప్పటికే 5,310 పోస్టులు భర్తీ చేశాం. మరో 11,714 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. గురుకులాలను డిగ్రీ కాలేజ్ స్థాయికి అప్ గ్రేడ్ చేశాం. అందరూ గర్వపడేలా గురుకులాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కూడా 3,140 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన ఖాళీల భర్తీకి కూడా చర్యలు చేపట్టాం. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులు భర్తీ చేయనున్నాం” అంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని వెల్లడించడంపై ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.