Revanth Reddy: 200 యూనిట్ల ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. ఎప్పటి నుంచంటే

ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు ముందుకు వేస్తోన్న కాం‍గ్రెస్‌ సర్కార్‌.. తాజాగా గృహజ్యోతికి పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు ముందుకు వేస్తోన్న కాం‍గ్రెస్‌ సర్కార్‌.. తాజాగా గృహజ్యోతికి పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే.. వాటి అమలుకు చర్యలు వేగవంతం చేసింది. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన కొన్ని హామీలు ఇప్పటికే అమలు చేస్తుండగా.. మరి కొన్నింటి అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రెడీ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రజాపాలన అభయహస్తం పథకం ద్వారా.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి.. మిగతా హామీలన్నింటిని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ హామీ అమలుకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

సచివాలయంలో బుధవారం నాడు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్తు వినియోగం, 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద.. ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు రేవంత్‌ రెడ్డి.

ఈసందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను కచ్చితంగా ఇచ్చి తీరాలని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాక విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని విద్యుత్తు సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరంగా ఉన్న అవకాశాల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి సరైన విద్యుత్తు పాలసీని రూపొందించకపోవడంతో రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి సరైన పరిష్కారం ఆలోచించాలని.. అందుకోసం పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడ మెరుగైన విధానం అమలవుతుందో అధ్యయనం చేసి.. నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తెంగాణలో మెరుగైన విద్యుత్‌ విధానాన్ని అమలు చేయడం కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలతో చర్చించి.. త్వరలోనే సరికొత్త విద్యుత్తు పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Show comments