iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: తెలంగాణలో ఆ రైతులకు రుణమాఫీ వర్తించదు.. పూర్తి వివరాలు మీకోసం

  • Published Jul 16, 2024 | 11:48 AM Updated Updated Jul 17, 2024 | 12:17 PM

Revanth Reddy-Rythu Runa Mafi Guidelines: తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. దాని ప్రకారం రుణమాఫీకి అర్హులెవరంటే..

Revanth Reddy-Rythu Runa Mafi Guidelines: తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. దాని ప్రకారం రుణమాఫీకి అర్హులెవరంటే..

  • Published Jul 16, 2024 | 11:48 AMUpdated Jul 17, 2024 | 12:17 PM
Rythu Runa Mafi: తెలంగాణలో ఆ రైతులకు రుణమాఫీ వర్తించదు.. పూర్తి వివరాలు మీకోసం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రెడీ అవుతోంది. అధికారంలోకి రాగానే కొన్ని హామీలను నెరవేర్చింది. వంద రోజుల్లోగా అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ మధ్యలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. హామీల అమలుకు అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు కోడ్‌ ముగియడంతో.. మిగతా హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వీటిల్లో ముఖ్యమైన 2 లక్షల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. బ్యాంకుల దగ్గర నుంచి లబ్ధిదారులు జాబితాను తీసుకోవడమే కాక.. అర్హుల లిస్ట్‌ను ప్రిపేర్‌ చేస్తోంది.

రుణమాఫీ​​కి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపగా.. తాజాగా పంట రుణమాఫీ అమలుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది సర్కారు. కాగా.. ఈ మార్గదర్శకాలలో రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్డును తప్పనిసరి చేయటమే కాకుండా.. కొన్ని నిబంధనలు కూడా పెట్టటం గమనార్హం. ఈ మార్గదర్శకాల నేపథ్యంలో.. రైతులందరికీ ఈ రుణమాఫీ పథకం వర్తించదు. పూర్తి వివరాలివిగో..

పంట రుణమాఫీకి ఆహార భద్రతా కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇది కేవలం తెల్లరేషన్ కార్డుదారులకు మాత్రం ఈ పథకం వర్తించనుంది. దీన్ని బట్టి.. పింక్ రేషన్ కార్డు దారులతో పాటు ట్యాక్స్ పేయర్లకు కూడా రుణమాఫీ పథకం వర్తించదని తెలుస్తోంది.

ఇక.. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో చెప్పుకొచ్చింది. అంటే.. వరి, పత్తి, చెరుకు, కూరగాయలు లాంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇక.. మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి దీర్ఘ కాలిక పంటలకు రుణమాఫీ వర్తించదు.

మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగతా ప్రైవేటు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వర్తించదు.

పంట రుణమాఫీకి డెడ్‌లైన్‌ 12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023. ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలనే ప్రభుత్వం మాఫీ చేయనుంది. అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు.

అలానే రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. కానీ ప్రభుత్వం ఇక్కడో షరతు పెట్టింది. 2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ముందుగా 2 లక్షలకు పైబడివున్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తరువాతే.. అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు అకౌంట్‌కు బదిలీ చేయనున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో.. ముందుగా మహిళ పేరు మీద తీసుకున్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.

ఇక.. ఈ రుణమాఫీలో భాగంగా ఎస్‌హెచ్ఐలు, జెఎల్టీలు, ఆర్ఎంజీలు, ఎస్ఇసీఎస్‌కు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. రీషెడ్యూలు చేసిన రుణాలకు కూడా ఈ పథకం వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు కూడా వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.