Dharani
ఓవైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నా రెస్టారెంట్ యజమానులు ఏమాత్రం భయపడటం లేదు. కల్తీ ఆహారంతో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఓవైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నా రెస్టారెంట్ యజమానులు ఏమాత్రం భయపడటం లేదు. కల్తీ ఆహారంతో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
Dharani
గత కొన్నాళ్లుగా బయట భోజనం తినే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సమయంలో కొన్ని రోజులు జనాలు భయపడ్డా.. మళ్లీ ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ బాగా పుంజుకుంది. ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులో ఉండటంతో.. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా.. ఎప్పుడంటే.. అప్పుడు.. ఏం కావాలంటే.. అది ఆర్డర్ చేసి లాగించేస్తున్నారు. అయితే బయట రెస్టారెంట్లు, హోటల్స్‌లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో.. తాజాగా ఫుడ్ సెఫ్టీ అధికారులు నిర్వహిస్తోన్న సోదాల్లో బట్టబయలు అవుతోంది. ఏమాత్రం పరిశుభ్రంగా లేని పరిసరాలు.. పాడైపోయి.. కుళ్లి పోయిన, నాణ్యత లేని, డేట్ అయిపోయిన పదార్థాలతో ఆహారం తయారు చేస్తూ.. జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఏవో చిన్న చిన్న రెస్టారెంట్లు అనుకుంటే.. పేరు మోసిన హోటల్స్, రెస్టారెంట్లలో కూడా ఇదే పరిస్థితి. వేలకు వేల రూపాయలు చెల్లించి విషాన్ని కొనుకున్నట్లు అవుతుంది.
ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల వల్ల బయట ఆహారం ఎంత దారుణంగా ఉంటుందో జనాలకు అర్థం అవుతుంది. దాంతో చాలా మంది ఇప్పుడు బయట ఆహారం అంటే భయపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఏం కాదులే అనుకుని.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు.. ఫలితంగా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ తరహా ఘటన వెలుగు చూసింది. మండి బిర్యానీ తిని.. ఓ కుటుంబం ఆస్పత్రి పాలైంది. ఫ్యామిలిలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరికి రక్తపు వాంతులు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మే 22న ఈ దారుణం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందని కావాలి నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు సందర్భంగా.. కుటుంబంతో కలిసి షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ వారంతా మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి వచ్చారు. అప్పుడే అసలు కథ మొదలైంది. ఇంటికి వచ్చిన కాసేపటికే.. వారందరికి వరుసగా వాంతులు, విరోచనాలు కావడం మొదలయ్యింది. వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. నరేందర్‌కు ఏకంగా రక్తపు వాంతలు కావడంతో.. అతడిని ఐసీయూలో చేర్చారు. నరేందర్‌తో పాటు అతడి భార్య, మిగతా కుటుంబ సభ్యులు ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాపం పెళ్లి రోజు సందర్భంగా ఎంజాయ్ చేద్దామనుకుని రెస్టారెంట్‌కి వెళ్తే.. వారి నిర్లక్ష్యం కారణంగా.. ఏకంగా ఆస్పత్రి ఐసీయూలో చేరి.. లక్షల రూపాయలు వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ నరేందర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్లు.. లాభాలకు ఆశపడి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమాత్రం మంచిది కాదని.. ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు.