తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు దక్కని నేతలు.. పక్క పార్టీలవైపు పయణిస్తున్నారు. ఇక అసంతృప్తులను బుజ్జగింపు పర్వం ఒక పక్క కొనసాగుతూనే ఉండగానే.. తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో తుమ్మల బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు’ అన్న సామెత మనకు తెలియనిది కాదు. ఆ నానుడిని నిజం చేస్తూ.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో.. రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశారు. దీంతో టికెట్ దక్కని నేతలు అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పాలిటిక్స్ కీలక భేటీతో మరింతగా వేడెక్కాయి. శనివారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనని కలిశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ రంగు ఎన్నికలకు ముందే పులుముకుంది. తుమ్మలతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడారు పొంగులేటి.
పొంగులేటి మాట్లాడుతూ..”తుమ్మల నాగేశ్వరరావుకు రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్దితో ప్రజల కొరకు పనిచేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో తుమ్మలను పొమ్మనలేక పొగబెట్టారు. కాగా.. తుమ్మలను, వారి అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కోరాను. అయితే కార్యకర్తలను, ప్రజలను, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు” అంటూ పొంగులేటి చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..” పొంగులేటి నాకు చిరకాల మిత్రుడు. ఆయన ఏ రంగంలో ఉన్నా.. ఇద్దరి ఒకరికి ఒకరు శ్రేయోభిలాషులమే. 40 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నాను. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని కాపాడుకుంటూ.. ముందుకు సాగుతున్నాను. ఇక కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారు.
అయితే సీతారామ ప్రాజెక్ట్ లోకి గోదావరి జలాల విడుదల చూడాలన్నదే నా కోరిక. ఆ ప్రాజెక్ట్ పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అందరి అభిప్రాయాలు తీసుకుని నా తదుపరి నిర్ణయం ప్రకటిస్తా” అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏనాడూ బహిరంగంగా ఒకరిని ఒకరు పలకరించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ భేటీతో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాక తెలంగాణ రాజకీయాలు కూడా ప్రభావితం అవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి తుమ్మల-పొంగులేటి భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.